Rishi Sunak: ప్రధాని పదవికి నేనే బెస్ట్‌..!

బ్రిటన్ ప్రధాని(British Prime Minister) పీఠం కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్‌(Rishi Sunak), మరో నేత లిజ్‌ ట్రస్‌(Liz Truss) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

Published : 07 Aug 2022 01:45 IST

నా సందేశాలకు ప్రజలు స్పందిస్తున్నారు: సునాక్‌

లండన్‌: బ్రిటన్ ప్రధాని(British Prime Minister) పీఠం కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్‌(Rishi Sunak), మరో నేత లిజ్‌ ట్రస్‌(Liz Truss) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బోరిస్‌ జాన్సన్ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు ఈ కన్జర్వేటివ్ పార్టీ నేతలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సునాక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పదవికి తానే తగిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. ప్రచార సమయంతో తాను ఇచ్చిన సందేశాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. 

‘ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, దేశాన్ని ఒక్కతాటిపై నడిపించడం వంటి అంశాలపై నేను ఇచ్చే సందేశాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని ఓడించే వ్యక్తి గురించే మా పార్టీ సభ్యులు ప్రధానంగా దృష్టిసారిస్తున్నారని నాకు తెలుసు. దేశం ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించేందుకు, ప్రధాని గద్దె ఎక్కేందుకు నేనే తగిన వ్యక్తిని. మహమ్మారి సమయంలో నేను అత్యవసరంగా తీసుకున్న నిర్ణయాలను మీరు చూశారు. అదే రీతిలో నిర్ణయాలు తీసుకుంటాను. ప్రభుత్వంపై నమ్మకాన్ని తిరిగి తీసుకువస్తాను. ప్రస్తుత పోటీలో పురోగతి సాధించగలననే విశ్వాసంతో ఉన్నాను’ అని సునాక్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పలు సర్వేలు సునాక్‌ కంటే ట్రస్‌ ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొంటున్నాయి. దీనిని మీరు అంగీకరిస్తారా..? అని అడగ్గా.. ‘పార్లమెంటరీ స్థాయిలో ప్రతి రౌండ్‌లో నేను ముందువరుసలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పార్లమెంట్ సభ్యుల నుంచి భారీగా మద్దతు ఉంది. ఈ సమయంలో నేను ప్రతి ఓటు కోసం గట్టిగా కృషి చేస్తాను’ అని వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. ప్రతి సర్వేలో వెనుకబడినట్లు కనిపిస్తోన్న రిషికి గురువారం జరిగిన టీవీ చర్చ కాస్త ఊరటనిచ్చింది. ‘బ్యాటిల్‌ ఫర్‌ నంబరు 10’ పేరిట స్కై న్యూస్‌ ఛానల్‌ ఈ అభ్యర్థులిద్దరి మధ్య చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా సునాక్‌, ట్రస్‌లు తామెందుకు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్థానంలోకి రావల్సిన ఆవశ్యకత ఉందో వివరించారు. చర్చలో ఎవరు విజయం సాధించారనే విషయంపై నిర్వహించిన ఎన్నికలో సునాక్‌కే పార్టీ సభ్యులు ఆధిక్యం కట్టబెట్టారు. అయితే చర్చా కార్యక్రమంలో భాగంగా కొందరు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సునాక్‌ సమాధానం ఇచ్చారు. పలు సర్వేల్లో వెనుకంజలో ఉండటాన్ని ఉద్దేశించి..ఏ క్షణంలోనైనా ప్రధానమంత్రి పదవి రేసు నుంచి మీరు వైదొలుగుతారా? అని అడిగారు. అందుకు రిషి స్పందిస్తూ.. అలా ఎప్పటికీ జరగదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని