Ukraine: 75 క్షిపణులతో ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడ్డ రష్యా..

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై  సోమవారం రష్యా దాడులు మొదలుపెట్టింది. ఉదయం కీవ్‌ నగరం పేలుళ్లతో దద్దరిల్లింది.

Updated : 10 Oct 2022 15:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై సోమవారం రష్యా దాడులు మొదలుపెట్టింది. ఉదయం కీవ్‌ నగరం పేలుళ్లతో దద్దరిల్లింది. జూన్‌ 26 తర్వాత ఉక్రెయిన్‌ రాజధానిపై రష్యా దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ దాడులకు దాదాపు 75 క్షిపణులు వాడినట్లు సమాచారం. కెర్చ్‌ వంతెన పేల్చివేతలో ఉక్రెయిన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం హస్తముందని పుతిన్‌ ఆరోపించిన తర్వాత ఈ దాడులు మొదలు కావడం గమనార్హం.  నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు మేయర్‌ విటాలి ఓ టెలిగ్రామ్‌ ఛానల్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం సమీపంలో కూడా దాడి జరిగినట్లు ఆ దేశ ఇంటీరియర్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కీవ్‌తోపాటు జైటోమిర్‌, ఖెల్నిట్స్కీ, డెనిప్రో, ల్వీవ్‌, టెర్నోపిల్‌ నగరాలపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు మొత్తం 8 మంది మరణించగా మరో 24 మంది గాయపడినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. క్షిపణి దాడులు ఉక్రెయిన్‌ ధైర్యాన్ని దెబ్బతీయలేవని ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజినికోవ్‌ వెల్లడించారు.

ఈ దాడులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ‘మా దేశాన్ని భూమిపై నుంచి తుడిచి పెట్టాలని రష్యా భావిస్తోంది. జపొరిజియాలో ఇళ్లల్లో నిద్రిస్తున్న మా ప్రజలను అంతమొందించింది. డెనిప్రో, కీవ్‌లకు పనులకు వెళ్లే వారిని చంపింది. ఉక్రెయిన్‌ మొత్తం వైమానిక దాడుల సైరన్లు మోగుతున్నాయి. క్షిపణి దాడులు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు కొందరు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు’’ అని వెల్లడించారు.

మరో వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కెర్చ్‌ వంతెనపై దాడిని  తీవ్రంగా పరిగణించారు. ఆయన రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌తో కూడా భేటీ కానున్నారు. గత ఏప్రిల్‌లో కీవ్‌ సరిహద్దుల నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవడంతో ఇప్పటికే  అవి ఉక్రెయిన్‌ సైనికుల ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు రష్యా ఈ నగరంపై గురిపెట్టింది. మరోవైపు రష్యా దళాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈశాన్య, దక్షిణ భాగాల్లో వాటి పరిస్థితి బాగోలేదని పేర్కొంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని