Pervez Musharraf: భారత్‌లోకి చొరబడి మీటింగ్ పెట్టిన ముషారఫ్..!
కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ ఆర్మీచీఫ్‌గా ఉన్న ముషారఫ్ భారత్ భూభాగంలోకి అడుగుపెట్టాడు. అక్కడ చొరబాటు దారులతో మీటింగ్ కూడా నిర్వహించాడు.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
భారత్-పాక్ మధ్య 1971 యుద్ధం జరిగిన సమయంలో పర్వేజ్ ముషారఫ్ (Pervez Musharraf)ఆ దేశ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో కమాండోగా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ ఆవిర్భవించడంతో ముషారఫ్ (Pervez Musharraf) పగతో రగిలిపోయాడు. భారత్‌పై ద్వేషాన్ని మరింత పెంచుకొన్నాడు. సమయం కోసం కాచుకు కూర్చున్నాడు. 1998లో ఆ సమయం ఆసన్నమైంది. భారత శక్తి సామర్థ్యాలను ఏమాత్రం అంచనావేయకుండా నిప్పుతో చెలగాటమాడాడు. కార్గిల్ పర్వతసానువుల్లో కయ్యానికి కాలు దువ్వాడు. కానీ, ఫలితం ఏమీ మారలేదు.. పాక్ (pakistan)సైన్యం మరోసారి అవమానం మూటగట్టుకొంది.
ఎప్పటి నుంచో తహతహ..
1996 నాటికి పర్వేజ్ ముషారఫ్(Pervez Musharraf) పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ హోదాలో ఉండగా.. బెనజీర్ భుట్టో ప్రధానిగా ఉన్నారు. కశ్మీర్‌పై మెరుపు సైనిక చర్య చేపట్టాలని భుట్టోకు ఆయన సూచించాడు. కానీ, ఆమె అందుకు నిరాకరించారు. 2006లో ఓ ఇంటర్వ్యూలో బెనజీర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
1998 అక్టోబర్ 6వ తేదీన అప్పటి జనరల్ జహంగీర్ ఖరామత్‌ను నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ తొలగించి ముషారఫ్‌కు సైనిక పగ్గాలు అందించారు. అక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్(Pervez Musharraf).. క్షణం కూడా వృథా చేయకుండా కార్గిల్‌పై దాడికి ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. కీలక పొజిషన్లలో తనకు నమ్మకమైన జనరల్స్‌ను నియమించారు. రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, నియంత్రణ రేఖ, సియాచిన్, చినాబ్ నది ప్రాంతాల బాధ్యతలు చూసే 10వ కోర్ కమాండర్, ఫోర్స్ కమాండ్ నార్తర్న్ ఏరియాస్ కమాండర్‌ను మార్చి తనకు అనుకూలమైన వారిని నియమించాడు.
ముషారఫ్ (Pervez Musharraf) సన్నిహితులైన మేజర్ జనరల్ జావెద్ అహ్మద్, లెఫ్టినెంట్ జనరల్ మెహమూద్ అహ్మద్, 10వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్‌లు ఆపరేషన్ కేపీ(కోహ్-ఇ-పైమా)కు ప్లాన్ చేశారు. దీనికి నాటి ఆర్మీచీఫ్ పర్వేజ్ ముషారఫ్ ఆశీస్సులు ఉన్నాయి. భారత్ లోపాలను వాడుకొని కశ్మీర్‌ను ఆక్రమించవచ్చని ముషారఫ్ బృందం కలలుగనడం మొదలుపెట్టింది. కానీ, 10వ కోర్‌లోని కొందరు జూనియర్ ఆఫీసర్లు ఈ ఆపరేషన్ ఆత్మహత్యా సదృశమని భయపడినా సీనియర్లు వినలేదు.
చిక్కటి శీతాకాలమైన డిసెంబర్‌లో ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చింది. ఈ సీజన్‌లో సాధారణంగా భారత్-పాక్ దళాలు అక్టోబర్ నుంచి మే వరకు అక్కడ ఉండవు. హిమపాతం తగ్గే వరకూ కొండలపైన పోస్టులను ఖాళీ చేస్తాయి. పాక్(pakistan) దీనినే అవకాశంగా చేసుకుని నార్తన్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన ఐదు బెటాలియన్లను ముజాహిద్దీన్ల ముసుగులో 1998 అక్టోబర్ నుంచి భారత్ భూభాగంలోకి పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ దళ సభ్యులను పాక్(pakistan)లోని గిల్గిట్-బాల్టిస్థాన్ నుంచి రిక్రూట్ చేసుకొన్నాయి. వీరికి పారామిలిటరీ శిక్షణతో పాటు.. కమాండో శిక్షణ కూడా ఇచ్చాయి. వీరిని పాక్(pakistan) ఎస్‌ఎస్‌జీల్లో కూడా నియమిస్తారు. ఈ దళాలు కార్గిల్, బటాలిక్ సెక్టార్, ద్రాస్ ప్రాంతాల్లో 100 -130 మైళ్ల పొడవునా భారత భూభాగంలోని పర్వత శిఖరాలపై ఉన్న 100కు పైగా పోస్టులను ఆక్రమించాయి. ఒక్కో పోస్టులో కనీసం 10 నుంచి 20 మంది పాక్ సైనికులు ఉన్నారు. పాక్‌లో కూడా మూడో కంటికి తెలియకుండా ఎన్‌ఎల్‌ఐ దళాలు కార్గిల్‌లోకి పంపించారు.
సాధారణ సల్వార్ కమీజ్ దుస్తుల్లో ఉన్న వీరి వద్ద భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. 1999 మార్చి 28వ తేదీన ఏకంగా పాక్(pakistan) ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్(Pervez Musharraf) భారత్‌లో 11 కిలోమీటర్ల లోపల చొరబాటుదారులు నిర్మించిన స్థావరాన్ని సందర్శించారు. భారత్ గడ్డపైకి పాక్ ఆర్మీచీఫ్ వచ్చి వారి సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించడం అదే తొలిసారి. పాక్ మాజీ కర్నల్ అష్ఫాక్ హుస్సేనీ రాసిన ‘‘విట్నెస్ టు బ్లండర్ : కార్గిల్ స్టోరీ అన్‌ఫోల్డ్’’ పుస్తకంలో దీన్ని బహిర్గతం చేశారు.
కుప్పకూలిన పాక్(pakistan) ప్లాన్..
భారత్ దళాలకు గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో చొరబాటుదార్లపై మేలో ఆపరేషన్ మొదలు కాగానే.. పాక్ ఏళ్ల తరబడి పన్నిన పన్నాగం పేకమేడలా కూలిపోయింది. తొలిసారి టోలోలింగ్ శిఖరాన్ని భారత దళాలు స్వాధీనం చేసుకోవడంతో పాక్(pakistan) ధైర్యం సడలడం మొదలైంది. మరో వైపు భారత దళాలు కూడా పూర్తి స్థాయిలో దాడికి దిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భారత నావికాదళం కూడా ఆపరేషన్ తల్వార్ చేపట్టింది. పాక్ సముద్ర మార్గంపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా ఆ దేశ వ్యాపారం కుంటుపడింది. కేవలం ఆరు రోజులకు సరిపడా చమురు మాత్రమే ఆ దేశంలో మిగిలింది.
ముషారఫ్(Pervez Musharraf)పై తిరుగులేని ఆధారాలు బహిర్గతం
కార్గిల్‌లో భారత్ జూన్ 6న భారీ ఎత్తున ఆపరేషన్ ప్రారంభించింది. ఆ తర్వాత 11వ తేదీన పాక్(pakistan) సైన్యం పాత్రను తెలియజేసేలా కీలక ఆధారాలను బహిర్గతం చేశారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ముషారఫ్(Pervez Musharraf), ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్‌లు రావల్పిండిలో జరిపిన ఫోన్ సంభాషణలు విడుదల చేశారు. దీనిలో.. ఎల్‌వోసీని మార్చడమే అంతిమ లక్ష్యమని ముషారఫ్ తన డిప్యూటీకి వెల్లడిస్తున్న వివరాలు బయటికొచ్చాయి. మే 26-29 మధ్యలో ఈ సంభాషణ జరిపినట్లు భావించారు.
* పాక్ దళాలు చొరబాట్లకు పాల్పడ్డ విషయం అమెరికాకు మే నెల కంటే మందే తెలుసు. కానీ, పరిస్థితి ఈ స్థాయిలోకి చేరుతుందని మాత్రం అంచనావేయలేదు. భారత్ ఆపరేషన్ తీవ్రం కావడంతో సాయం కోసం పాక్ అమెరికాను ఆశ్రయించింది. కానీ, నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ విషయంలో జోక్యానికి నిరాకరించారు. జులై 4వ తేదీన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజున క్లింటన్-షరీఫ్ భేటీ జరిగింది. పాక్ సైన్యం చొరబాట్లను షరీఫ్ అంగీకరించారు. తమ దళాలను వెనక్కి పిలుస్తామని హామీ ఇచ్చారు. ఒక దశలో షరీఫ్‌తో ప్రైవేటుగా మాట్లాడేందుకు కూడా క్లింటన్ ఇష్టపడలేదని ఆంగ్ల పత్రికలు కథనాలు వెలువరించాయి.
అమెరికా అధ్యక్షుడు క్లింటన్ నుంచి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై తీవ్రమైన ఒత్తిడి రావడం మొదలైంది. భారత దళాల దాడి తీవ్రతకు బటాలిక్, ద్రాస్, టైగర్ హిల్స్‌లో పాక్ సైన్యం తోకముడిచింది. జులై 5న పాక్ సైన్యం కార్గిల్ నుంచి వైదొలగుతున్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు. మరోవైపు బటాలిక్ సెక్టార్‌లోని మిగిలిన స్థావరాలను కూడా భారత్ స్వాధీనం చేసుకోవడంతో జులై14న ఆపరేషన్ విజయవంతమైందని భారత ప్రధాని వాజ్‌పేయీ ప్రకటించారు. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. పాక్ ఆర్మీచీఫ్ ముషారఫ్(Pervez Musharraf) ప్లాన్ విఫలమైంది. ఇది ఆ తర్వాత పాక్ రాజకీయాలను అతలాకుతలం చేసి.. దేశాన్ని సైనిక పాలనలోకి నెట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Movies News
Social Look: ఫొటో ఎంపిక చేసుకోమన్న యషిక.. పెయింటింగ్‌ని తలపించేలా మీనాక్షి స్టిల్!
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్