Elon Musk: అదో అర్థం లేని వాదన: అధిక సంతానంపై స్పందించిన మస్క్

అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ కొట్టిపారేశారు. ఇది అర్థం లేని అభిప్రాయమంటూ తోసిపుచ్చారు.

Published : 23 May 2022 15:16 IST

వాషింగ్టన్‌: అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ కొట్టిపారేశారు. ఇది అర్థం లేని అభిప్రాయమంటూ తోసిపుచ్చారు. ‘తక్కువ సంతానం కలిగిఉంటే పర్యావరణానికి మంచిదని కొంతమంది భావిస్తారు. జనాభా రెట్టింపైనా..పర్యావరణం బాగానే ఉంటుంది. జపాన్‌లో జననాల రేటు అత్యల్పంగా ఉంది. నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉంది. నాగరికత క్షీణించిపోవడాన్ని చూస్తూ ఉండలేం’ అంటూ ఇటీవల ఓ సదస్సులో మాట్లాడుతూ మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇటీవల మస్క్‌ జపాన్ జనాభా గురించి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. క్రమంగా క్షీణిస్తోన్న జననాల రేటులో మార్పు రాకపోతే రానున్న రోజుల్లో జపాన్‌ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్థికవ్యవస్థ కలిగిన జపాన్‌లో గత కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోతోంది. 2008లో జనాభా పెరుగుదల గరిష్ఠంగా నమోదైన జపాన్‌లో గతేడాది 6లక్షల జనాభా తగ్గిపోయింది. గతేడాది అక్కడ 8.3లక్షల జననాలు నమోదుకాగా 14.4లక్షల మరణాలు సంభవించాయి. ఇలా ప్రతిఏటా అక్కడ మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. ఇక ప్రస్తుతం జపాన్‌ జనాభాలో 29శాతం మంది 65ఏళ్లకు పైబడినవారేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 14ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న జనాభా వాటా కేవలం 11.8శాతంగా ఉంది. ఇలా వృద్ధ జనాభా పెరుగుదలతోపాటు శ్రామిక శక్తి తగ్గిపోతుండడం జపాన్‌కు పెద్ద సవాలుగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని