Elon Musk: సరదాగా.. నెక్ట్స్‌ టార్గెట్ చెప్పేసిన మస్క్‌..!

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు కోసం టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌ చేసిన ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Published : 28 Apr 2022 13:34 IST

కాలిఫోర్నియా: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు కోసం టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌ చేసిన ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చివరకు 44 బిలియన్ల డాలర్లతో దాని కొనుగోలుకు ఒప్పందం చేసుకొన్నారు. ఈ క్రమంలో ఇతర కంపెనీలను కూడా స్వాధీనం చేసుకోండంటూ నెట్టింట్లో వ్యంగ్యంగా సూచనలు వస్తున్నాయి. దాంతో ఆయన మరో అసాధారణమైన ట్వీట్ చేశారు. కొకైన్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు కోకాకోలాను కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, తన అభిప్రాయాలు, ఆలోచనలు బహిరంగంగా చెప్పే మస్క్‌.. ఈ కొత్త లక్ష్యంపై సరదాగా స్పందించి ఉండొచ్చని తెలుస్తోంది. 

అందరికీ పరిచయమున్న శీతల పానీయం కోకాకోలా. దానిలో వాడే పదార్థాల ఆధారంగానే ఆ పేరు పెట్టారు. కోకా ఆకులు, కోలా నట్స్‌తో ఆ పానీయాన్ని తయారు చేస్తారు.  కోలా నట్స్‌లో కెఫిన్‌ ఉంటుంది. కోకా ఆకుల నుంచి కొకైన్‌ను తయారు చేస్తారు. అయితే కొకైన్‌పై అమెరికాలో నిషేధం ఉంది. కోకాకోలా ఫార్ములాలో కొకైన్‌ లేని కోకా ఆకుల్ని ప్రస్తుతం వినియోగిస్తున్నారు. దీనిని ఉద్దేశించే.. సరదాగా కొకైన్‌ను తిరిగి తీసుకువస్తానంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్‌ మస్క్‌.. కొద్ది వారాల క్రితమే ట్విటర్లో 9.2శాతం వాటాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కంపెనీని పూర్తిగా కొనుగోలు చేస్తానని ఆఫర్‌ కూడా ఇచ్చారు. దీనిపై కొన్ని రోజులుగా మస్క్‌తో ట్విటర్‌ బోర్డు చర్చలు జరిపింది. చివరకు దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు ఒప్పందం కుదిరింది. మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్‌డోర్సే మాత్రం ఈ కొనుగోలుకు పూర్తి మద్దతు ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని