Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు శిక్ష

పలు క్రిమినినల్​ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న మయన్మార్‌ కీలక నేత, నోబెల్‌ బహుమతి విజేత ఆంగ్​ సాన్​ సూకీకి మరో నాలుగేళ్ల శిక్ష ఖరారయ్యింది......

Published : 11 Jan 2022 01:18 IST

యాంగోన్‌: పలు క్రిమినినల్​ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న మయన్మార్‌ కీలక నేత, నోబెల్‌ బహుమతి విజేత ఆంగ్​ సాన్​ సూకీకి మరో నాలుగేళ్ల శిక్ష ఖరారయ్యింది. వాకీటాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం సహా కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రత్యేక న్యాయస్థానం తాజాగా ఆమెను దోషిగా తేల్చింది. ఇదిలా ఉంటే ఇతర పలు కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు.. గత డిసెంబర్‌లోనే సూకీకి నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై వ్యతిరేకత రావడంతో సైన్యం దాన్ని సగానికి తగ్గించింది.

ఎన్నికల్లో అక్రమంగా గెలిచారంటూ గతేడాది ఫిబ్రవరిలో సూకీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం.. ఆమెపై పలు కేసులు బనాయించింది. పలువురు కీలక నేతలను సైతం నిర్బంధించింది. వారిపై అవినీతి, ఎన్నికల్లో మోసాలు తదితర అభియోగాలు మోపి, విచారణ చేపట్టింది. అయితే తమ చర్యలను సమర్థించుకోవడానికి సైన్యం అనవసరంగా సూకీపై కేసులు మోపుతున్నారని ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. తమ నేతను మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొంటున్నారు.

1989-2010 మధ్యలో ఆంగ్‌ సాన్‌ సూకిని దాదాపు పదిహేనేళ్లు సైన్యం గృహ నిర్బంధంలోనే ఉంచింది. ఇప్పుడు మరిన్నిఅభియోగాల్లో దోషిగా తేల్చింది. మిగిలిన వాటిలోనూ దోషిగా తేలితే.. వందేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే 76 ఏళ్ల సూచీ.. మిగిలిన జీవితమంతా బందీగానే గడపాల్సి వస్తుంది. అయితే సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్​ ప్రజలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. 10నెలలు గడిచినా.. సైనిక పాలనను అంగీకరించడం లేదు. సూకీతో పాటు నిర్బంధించిన నేతలందరినీ విడుదల చేసి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆమోదించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని