Pakistan: జాతీయ అసెంబ్లీని రద్దు చేయండి.. అధ్యక్షుడికి ఇమ్రాన్‌ సిఫార్సు..

పాకిస్థాన్‌లో రాజకీయాలు గంటగంటకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం ఖాన్‌ సూరీ తిరస్కరించారు....

Updated : 03 Apr 2022 16:15 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో రాజకీయాలు గంటగంటకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం ఖాన్‌ సూరీ తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. చివరి నిమిషంలో స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌పైనా ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడంతో సూరీ సభకు అధ్యక్షత వహించారు. సభలో ప్రధాని ఇమ్రాన్ లేకపోవడం గమనార్హం. సభాపతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభ వాయిదా పడింది.

స్పీకర్‌ తీర్మానాన్ని తిరస్కరించినట్లు తెలిసిన కొన్ని నిమిషాల్లోనే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీకి సిఫార్సు చేసినట్లు ప్రకటించారు. కొత్తగా ఎన్నికలు నిర్వహణకు ఆదేశించాలని సూచించినట్లు తెలిపారు. పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చాలన్న విదేశీ కుట్రలను డిప్యూటీ స్వీకర్‌ తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అందుకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ప్రతిపక్షాలు ఖర్చు చేశాయని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నవారు వాటిని అనాథలు, పేదలకు పంచిపెట్టాలని హితవు పలికారు. పాకిస్థాన్‌ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

యావత్తు దేశం గమనిస్తుండగానే దేశద్రోహానికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి శక్తులకు దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. అసెంబ్లీని రద్దు చేస్తే తర్వాతి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని వ్యాఖ్యానించారు.

అంతకంటే ముందు ఇమ్రాన్‌ తన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఇస్లామాబాద్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆయనతో పాటు నేషనల్‌ అసెంబ్లీలో ఆయన వెంట ఉన్న మరో 155 మంది సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. అంతకంటే ముందు పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంలో ఓడిపోతే.. ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో వారు ఇమ్రాన్‌ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. పాక్‌ రాజకీయాల్లో విదేశీ శక్తుల ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని