Napoleon: నెపోలియన్‌ తుపాకుల వేలం.. ధర ఎంతంటే..?

ఐరోపా చరిత్రలో అత్యంత కీలకమైన చక్రవర్తి నెపోలియన్‌కు చెందిన తుపాకులను వేలం వేశారు. వీటికి ఊహించిన దానికంటే అధిక ధర లభించింది.   

Published : 08 Jul 2024 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐరోపా చరిత్రపై తిరుగులేని ముద్ర వేసిన ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనాపార్టే (Napoleon Bonaparte)కు చెందిన అరుదైన వస్తువులు వేలం వేశారు. వీటిల్లో రెండు పిస్తోళ్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి తన ఆత్మహత్యకు వినియోగించాలని నెపోలియన్‌ భావించాడు. వీటిని వేలం వేయగా 1.69 మిలియన్‌ యూరోలకు అవి అమ్ముడుపోయాయి. భారత కరెన్సీ ప్రకారం రూ.15 కోట్లు పైమాటే. 

బ్లూఫౌంటేన్‌ ప్యాలెస్‌ పక్కనే ఉన్న ఓసెనాట్‌ ఆక్షన్‌ హౌస్‌లో ఆదివారం వీటి వేలం జరిగింది. అదే ప్యాలెస్‌లో 1814 ఏప్రిల్‌ 12వ తేదీన నెపోలియన్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నెపోలియన్‌ వాడిన తుపాకులను లూయిస్‌ మెరైన్‌ గోస్సెట్‌ అనే కంపెనీ తయారుచేసింది. ఆ కంపెనీ ఆశించిన మొత్తం కంటే ఎక్కువే ఈ వేలంలో లభించింది. 

ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ తుపాకులను జాతీయసంపదగా ఇటీవలే ప్రకటించింది. ఆ తర్వాతే ఈ వేలం వేయడం గమనార్హం. కొత్త నిబంధనల ప్రకారం ఈ వస్తువులను ఎగుమతి చేయడంపై నిషేధం అమల్లోకి రానుంది. అదే సమయంలో ఇవి ఎవరివద్ద ఉంటే వారి నుంచి 30 నెలల్లోపు ఫ్రాన్స్‌ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 

ఈ తుపాకుల తయారీలో బంగారం, వెండి వినియోగించారు. అవి నెపోలియన్‌ సైనికాధికారి కుటుంబానికి వారసత్వంగా లభించాయి. ఈ వేలంలో తుపాకులు, వాటి బాక్స్‌, పౌడర్‌ హార్న్‌ ఇతర యాక్సెసరీస్‌లు కూడా వేలంలో పెట్టారు. గతంలో నెపోలియన్‌కు చెందిన ట్రైకార్న్‌ హ్యాట్‌ను వేలం వేయగా 1.9 మిలియన్‌ డాలర్లు లభించాయి.

1815లో ప్రవాసం నుంచి అధికారం చేపట్టిన నెపోలియన్‌ బ్యాటిల్‌ ఆఫ్‌ వాటర్‌లూలో ఓటమి పాలయ్యారు. 1821లో ఆయన మరణించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని