International Space Station: అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్‌కు నాసా కాంట్రాక్ట్‌

International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాసా ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌కు రూ.7వేల కోట్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చింది.

Published : 30 Jun 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూ ఉపరితలానికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (International Space Station) త్వరలోనే తొలగించనున్నారు. ఈ దశాబ్దం చివరికల్లా ఐఎస్‌ఎస్‌ను కూల్చివేయనున్నారు. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ప్రణాళికలు ప్రారంభించింది. ఐఎస్‌ఎస్‌ను కూల్చేందుకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ (SpaceX)తో 843 మిలియన్‌ డాలర్లతో (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. దీని తొలిభాగాన్ని 1998లో ప్రారంభించారు. ఆ తర్వాత దశలవారీగా దీన్ని విస్తరించారు. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టేస్తుంది. అమెరికా, రష్యా, జపాన్‌, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తుంటాయి. అనేక మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఇందులో పరిశోధనలు సాగిస్తుంటారు. దీని జీవితకాలం 2030 వరకు ఉంది. ఆ తర్వాత తొలగించనున్నారు.

ఐఎస్‌ఎస్‌లో కొద్దిసేపు ఎమర్జెన్సీ

డీఆర్బిట్‌ వెహికల్‌తో..

దీనికి సంబంధించిన ప్రణాళికలను నాసా ప్రారంభించింది.  ‘‘2030లో అంతరిక్ష కేంద్రం (ISS) జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయి. ఆ తర్వాత దాన్ని సురక్షితంగా సముద్రంలో పడేస్తాం. ఇందుకోసం జనసాంద్రత లేని ప్రదేశాలను గుర్తిస్తున్నాం’’ అని నాసా (NASA) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విచ్ఛిన్న ప్రక్రియలో భాగంగా తొలుత ఫుట్‌బాల్‌ మైదానం అంత పరిమాణంలో ఉండే ఈ రీసెర్చ్ ల్యాబ్‌ను 2030 మధ్యలో కొంచెం కొంచెంగా కిందకు తీసుకురానున్నారు. ఆ తర్వాత అందులోని కీలక సామగ్రితో వ్యోమగాములు భూమి మీదకు దిగుతారు. అనంతరం స్పేస్‌ఎక్స్‌ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న ‘యూఎస్‌ డీఆర్బిట్‌ వెహికల్‌’ దీన్ని భూవాతావరణంలోకి తీసుకొస్తుంది. అక్కడకు రాగానే అంతరిక్ష కేంద్రం కాలిపోతుంది. వాటి శకలాలను సముద్రంలో పడేలా చేస్తారు.

ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇందులో అయిదు పడక గదులున్నాయి. ఇప్పటివరకు 19 దేశాల వ్యోమగాములు, అంతరిక్ష పర్యటకులు దీన్ని సందర్శించారు. వీరిలో అత్యధికంగా అమెరికా నుంచి వెళ్లినవారే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని