NASA : గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించే ప్రయోగం విజయవంతం..

గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించేందుకు కీలక ముందడుగు పడింది. భూ గ్రహం వైపు ప్రమాదకరంగా దూసుకొచ్చే గ్రహ శకలాల కక్ష్యను మార్చే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన

Updated : 27 Sep 2022 12:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించేందుకు కీలక ముందడుగు పడింది. భూ గ్రహం వైపు ప్రమాదకరంగా దూసుకొచ్చే గ్రహ శకలాల కక్ష్యను మార్చే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ‘డార్ట్‌ (డబుల్‌ ఆస్ట్రాయిడ్‌ రీడైరెక్ట్‌ టెస్ట్‌)’ మిషన్‌ విజయవంతమైంది. ఇందుకోసం డిడిమోస్‌, డైమార్ఫస్‌ అనే జంట గ్రహశకలాలను నాసా ఎంచుకుంది. ఈ ప్రయోగంలో భాగంగా నాసా స్పేస్‌క్రాఫ్ట్‌ భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున డైమార్ఫస్‌ను ఢీకొట్టింది. అంతరిక్షంలో 11.3 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని గ్రహశకలం వద్ద ఇది చోటుచేసుకుంది. డార్ట్‌ వ్యోమనౌక 22,500 కి.మీ వేగంతో ఆ అంతరిక్ష శిలలోకి దూసుకుపోయింది. ఈ ప్రక్రియను వ్యోమనౌక సొంతంగా చేపట్టింది. డార్ట్‌తో పాటు చిన్న ఉపగ్రహం లిసియాక్యూబ్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఢీకొనడం వల్ల వెలువడిన ధూళిని ఫొటో తీసి భూమికి పంపనుంది.

ఈ ప్రయోగం అనంతరం ‘ ప్రభావం కనిపించింది’ అంటూ మిషన్‌ కంట్రోల్‌కు చెందిన ఇంజినీర్‌ ఎలీనా ఆడమ్స్‌ ప్రకటించారు. ‘మా తొలి గ్రహ రక్షణ పరీక్ష విజయవంతమైంది. భూగ్రహంపై ఉన్న వారు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను’ అంటూ ఆడమ్స్‌ మీడియా సమావేశంలో ప్రకటిస్తుండగా ఆ గదంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ ప్రయోగం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, అంతరిక్షంలో ఉన్న టెలిస్కోప్‌లు ఈ అద్భుత దృశ్యాన్ని బంధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. డార్ట్‌ ప్రభావం వెంటనే స్పష్టంగా కనిపించినప్పటికీ.. గ్రహశకలం మార్గం ఎంతగా మారిందో గుర్తించడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

325 మిలియన్‌ డాలర్ల వ్యయంతో ఈ మిషన్‌ చేపట్టారు. గత ఏడాది నవంబరులో ఇది నింగిలోకి దూసుకెళ్లింది. అంతరిక్షంలో ఒక గ్రహశకలం లేదా ఎదైనా ఇతర సహజ వస్తువుల స్థానాన్ని మార్చడానికి చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలంతా దీని ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

‘డార్ట్‌’ ఏం చేస్తుందంటే..!

భూమి దిశగా ఏదైనా గ్రహశకలం వస్తుందని నిర్ధారించినప్పుడు దాని కక్ష్యలో మార్పు చేయడం ద్వారా సురక్షితంగా పక్కకు మళ్లించడం సాధ్యమేనా అన్నది డార్ట్‌ మిషన్‌ పరీక్షిస్తుంది. ఇందుకోసం డిడిమోస్‌, డైమార్ఫస్‌ అనే జంట గ్రహశకలాలను నాసా ఎంచుకుంది. ఇలాంటి గ్రహశకల వ్యవస్థలో ఒక పెద్ద శిల చుట్టూ చిన్న శిల తిరుగుతూ ఉంటుంది. భూమికి చేరువలో ఉన్న గ్రహశకలాల్లో ప్రతి ఐదింట్లో ఒకటి ఇలాంటి జంట గ్రహశకల వ్యవస్థే. ఇక్కడ డిడిమోస్‌ చుట్టూ డైమార్ఫస్‌ తిరుగుతోంది. నిజానికి ఈ గ్రహశకల వ్యవస్థతో భూమికి ప్రమాదమేమీ లేదు. ప్రయోగం కోసమే నాసా డైమార్ఫస్‌తో డార్ట్‌ వ్యోమనౌకను ఢీ కొట్టించింది. దీనివల్ల ఆ గ్రహశకల కక్ష్యలో చోటుచేసుకునే స్వల్ప మార్పును భూమి నుంచి కొలుస్తారు. డార్ట్‌ వ్యోమనౌక ఒక కైనెటిక్‌ ఇంపాక్టర్‌లా పనిచేస్తుంది.

మన గ్రహానికి చేరువలో వేల సంఖ్యలో అంతరిక్ష శిలలు ఉన్నాయి. వాటిలో ఏదైనా  భూమి దిశగా దూసుకొస్తే విధ్వంసం తప్పదు. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని