School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

సోమవారం అమెరికా(America)లో మరోసారి తుపాకీ పేలింది. ఈ కాల్పులకు తెగబడిన వ్యక్తి పక్కా ప్రణాళికతో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

Updated : 28 Mar 2023 17:17 IST

నాష్‌విల్‌ (అమెరికా): అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నిస్సే రాష్ట్రంలోని  నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాల(Nashville School Shooting)లో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో నిందితురాలు/నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.  అయితే, ఈ కాల్పులకు తెగబడేందుకు ఆ వ్యక్తి ముందుగానే  సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి పేరు ఆడ్రే హలే(28) అని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి లింగమార్పిడి చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో  పోలీసులు హలేని ‘ఆమె’ అని సంబోధిస్తుండగా.. లింక్డిన్‌ ప్రొఫైల్‌ మాత్రం పురుషుడిగా సూచిస్తోంది. ఇది ఆకస్మికంగా జరిగిన షూటింగ్(School Shooting) కాదని పోలీసులు వెల్లడించారు. భారీస్థాయిలో కాల్పులకు ప్రణాళిక రచించినట్లు ఆ వ్యక్తి వద్ద లభించిన మెనిఫెస్టో, మ్యాప్‌ను బట్టి తెలుస్తోందన్నారు. తన ప్రణాళికలో పాఠశాల ఒకటని, ఇంకా పలు ప్రాంతాల్లో కాల్పులు జరపాలనుకున్నట్లు చెప్పారు. ఒకపక్కగా ఉన్న ప్రవేశ ద్వారం నుంచి పాఠశాలలోకి ప్రవేశించి, కాల్పులు జరుపుతూ భవనంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు మరణించగా.. మృతుల్లో మరో ముగ్గురు 60 ఏళ్ల వయస్సు వారు. ఈ మృతుల్లో ఒకరు పాఠశాల హెడ్ అని సమాచారం. ఇక పోలీసుల కాల్పుల్లో హలే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటన వెనక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్రలేకపోవడం, ఉన్నత విద్యార్హతలుండటం గమనార్హం.  ఈ హింసాకాండను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఖండించారు. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 

కాల్పుల ప్రకటన ముందు బైడెన్ జోకులు..

కాల్పులు గురించి ప్రకటన చేయడానికి ముందు బైడెన్( Joe Biden) మాట్లాడిన తీరు విమర్శలకు దారితీస్తోంది. వాటి గురించి మాట్లాడే ముందు ఐస్‌క్రీం గురించి ప్రస్తావించారు. ‘నా పేరు జో బైడెన్‌. నేను జిల్‌ బైడెన్ భర్తను. నేను జెనీస్‌ ఐస్‌క్రీం, చాక్లెట్‌ చిప్స్ తింటాను. వీటి కోసం నేను ఇక్కడకు వచ్చాను. నేను జోక్ చేయట్లేదు.. నిజమే చెప్తున్నా’ అంటూ బైడెన్ అసందర్భంగా మాట్లాడారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని