Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్‌ ఆపన్నహస్తం..!

భూకంపం (Earthquake) ధాటికి వణికిపోయిన తుర్కియేను ఆదుకునేందుకు ‘ఆపరేషన్‌ దోస్త్‌’ (Operation Dost) పేరుతో భారత ప్రభుత్వం సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నం కాగా.. తాజాగా వైద్య పరికరాలు, ఔషధాలు పంపిస్తున్నట్లు తెలిపింది.

Published : 09 Feb 2023 01:40 IST

దిల్లీ: భారీ భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే (Turkey), సిరియా దేశాలకు భారత్‌ ఆపన్నహస్తం అందిస్తోంది. ఇందుకోసం ఆపరేషన్‌ దోస్త్‌ (Operation Dost) పేరుతో సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి ఆస్పత్రులు, ఔషధాలు, సహాయక బృందాలు పంపిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని.. మరిన్ని బృందాలనూ పంపిస్తున్నట్లు తెలిపింది.

‘భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారుతుండటం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ, అన్ని దేశాలతో స్థిరమైన సంబంధాలు కొనసాగిస్తున్నాం. ‘వసుదైక కుటుంబం’ అనే విధానాన్ని అనుసరించే భారత్‌.. మానవతా సాయానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ వెల్లడించారు. భారత్‌తో విభేదాలున్నప్పటికీ తుర్కియేకి సహాయం చేయడంపై ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. ఇదివరకు బయలుదేరిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. భూకంప ప్రభావిత ప్రాంతమైన గజియన్‌తేప్‌లో ఇప్పటికే సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టాయని చెప్పారు.

‘విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న తుర్కియేకు 101 సిబ్బందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ తొలి బృందం ఇప్పటికే అక్కడకు చేరుకుంది. అనంతరం క్షేత్ర స్థాయి ఆస్పత్రులను నెలకొల్పేందుకు కావాల్సిన పరికరాలు, ఔషధాలు, ఇతర పరికరాలతో భారత వాయుసేన విమానం సీ17 తుర్కియేకు బయలుదేరింది. మానవతా సహాయం చేసేందుకు భారత్‌ నుంచి వెళ్లిన నాలుగో విమానం ఇది. ఇందులో భారత సైన్యానికి చెందిన 54 మంది వైద్యుల బృందంతోపాటు ఇతర వైద్య పరికరాలు ఉన్నాయి’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బగ్చీ పేర్కొన్నారు.

సమయం మించిపోతోంది..

గత కొన్ని దశాబ్దాల్లో చవిచూడని విపత్తును తుర్కియే, సిరియాలు ఎదుర్కొంటున్నాయి. తీవ్ర భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద వేల మంది చిక్కుకున్నట్లు అంచనా. వీరిలో ఇప్పటికే 11వేలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించగా.. ఇంకా వేల మంది ఆ శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిని రక్షించేందుకు ‘సమయం మించిపోతోందని’ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

భారత్‌ నిజమైన దోస్త్‌

ఆపద సమయంలో సహాయం అందిస్తోన్న భారత్‌.. తమ ‘దోస్త్‌’ అంటూ తుర్కియే రాయబారి ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్‌ దోస్త్‌’ అనే పేరుతో భారత్‌ కూడా తుర్కియే, సిరియా దేశాలకు సహాయం చేస్తోంది.  భారత్‌తో పాటు అమెరికా, చైనా, గల్ఫ్‌ దేశాలు కూడా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. అవసరమైన సిబ్బందిని ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని