Ukraine: ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాలకు జంతువుల కళ్ల పార్సిళ్లు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. తమ దేశానికి చెందిన సుమారు 10,000 నుంచి 13,000 మంది సైనికులు మరణించి ఉంటారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముఖ్య సలహాదారు మైఖైలో పొడొల్యాక్‌ వెల్లడించారు.  

Updated : 03 Dec 2022 07:50 IST

జెలెన్‌స్కీ సలహాదారు మైఖైలో వెల్లడి
రెండు వైపులా లక్ష చొప్పున మరణించి ఉంటారని అమెరికా అంచనా

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. తమ దేశానికి చెందిన సుమారు 10,000 నుంచి 13,000 మంది సైనికులు మరణించి ఉంటారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముఖ్య సలహాదారు మైఖైలో పొడొల్యాక్‌ వెల్లడించారు. అయితే తొమ్మిది నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో మరణాల సంఖ్య పాశ్చాత్య నాయకుల అంచనాలకు చాలా దూరంలో ఉండటం గమనార్హం. ‘‘మాకు మరణాలపై జనరల్‌ స్టాఫ్‌ నుంచి అధికారిక సమాచారం ఉంది. వారి లెక్క ప్రకారం 10,000-13,000 సైనికులు మరణించారు. గాయపడిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రష్యా దాడిలో దుర్మరణం పాలైన పౌరుల సంఖ్యా అధికంగానే ఉంది. ’’ అని పొడొల్యాక్‌ ఛానల్‌ 24కు తెలిపారు.

మరోవైపు గత నెల అమెరికా సైనిక జనరల్‌ మార్క్‌ మిల్లీ మాత్రం పూర్తిగా భిన్నమైన సంఖ్యను చెప్పారు. వారి లెక్కల ప్రకారం సుమారు లక్ష మంది రష్యా, లక్ష మంది ఉక్రెయిన్‌ సైనికులు, 40 వేల మంది పౌరులు మరణించడమో.. గాయపడటమో జరిగిందన్నారు.  ఐరోపా కమిషన్‌ అధిపతి ఉర్సులా వొన్‌డెర్‌ లెయెన్‌ బుధవారం మాట్లాడుతూ లక్ష మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించారని వెల్లడించారు. దాదాపు 20,000 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత ఆమె ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ అది పొరబాటున చెప్పిన అంకె అని సవరించారు. ఇరువైపులా మొత్తం లక్ష మంది మరణించారని చెప్పారు.

జెలెన్‌స్కీని కలిసిన బేర్‌గ్రిల్స్‌..

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్‌ బేర్‌ గ్రిల్స్‌ ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని బేర్‌ గ్రిల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఉక్రెయిన్‌ నుంచి వైదొలగేందుకు రష్యా తిరస్కరణ

కీవ్‌: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు కోసం భవిష్యతులో ఎటువంటి చర్చలు సాగించాలన్నా ఆ దేశం నుంచి రష్యా సైన్యం పూర్తిగా వైదొలగాలన్న పాశ్చాత్య దేశాల ప్రతిపాదనలను రష్యా తోసిపుచ్చింది. ‘‘చర్చలకు మా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్‌లోని మా దళాలను ఉపసంహరించుకోవాలన్న పశ్చిమ దేశాల డిమాండ్‌ అంగీకార యోగ్యం కాదు’’ అని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాలకు జంతువుల కళ్ల పార్సిళ్లు

కీవ్‌: ఐరోపాలోని పలు దేశాల్లో ఉన్న తమ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లకు జంతువుల కళ్లతో కూడిన ప్యాకెట్లు అందాయని ఉక్రెయిన్‌ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఇలా హంగరీ, నెదర్లాండ్స్‌, పోలండ్‌,  క్రొయేషియా, ఇటలీ, నేపుల్స్‌, చెక్‌ నగరం బ్రోనోల్లో జరిగినట్లు ఉక్రెయిన్‌ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ఓలేహ్‌ నికొలెంకో ఫేస్‌బుక్‌లో తెలిపారు. ఈ పార్సిళ్లు పంపడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని