Corona: రెండేళ్లు దాటినా.. కరోనా బాధితుల్లో ఆ లక్షణాలు..!

కరోనా మహమ్మారి రోజుల్లోనే నయమవుతున్నా.. కొంత మందిని మాత్రం దీర్ఘకాల కొవిడ్‌ వేధిస్తోంది. దీనివల్ల వారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Updated : 21 Nov 2022 16:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి రోజుల్లోనే నయమవుతున్నా.. కొంత మందిని మాత్రం దీర్ఘకాల కొవిడ్‌ వేధిస్తోంది. దీనివల్ల వారు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన బాధితుల్లో దాదాపు సగం మందిలో రెండేళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయట. ఈ మేరకు లాన్సెంట్‌ అధ్యయనం వెల్లడించింది.

రెండేళ్ల క్రితం కరోనా వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ఈ వైరస్‌ కారణంగా చాలా మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అయితే, వారిలో దాదాపు సగం మందికి కోలుకొన్న తర్వాత కూడా ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కొవిడ్‌ 19 మన ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపిస్తోందని స్పష్టమవుతోంది.

‘‘వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా కొవిడ్‌ బాధితులు శారీరకంగా, మానసికంగా కోలుకున్నారు. ఈ రెండేళ్లలో చాలా మంది తిరిగి తమ విధుల్లో చేరిపోయారు. అయితే, కొందరిలో మాత్రం కొవిడ్‌ లక్షణాల పర్యవసాలను ఇంకా భారంగానే ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొవిడ్ బాధితులు కాస్త తక్కువగా ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో చాలా మంది రెండేళ్లు దాటినా కూడా అలసట, కండరాల నొప్పి, నిద్రలేమి, శ్వాస సంబంధ సమస్యలు.. ఇలా ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు’’ అని లాన్సెంట్‌ అధ్యయనం వెల్లడించింది.

లాంగ్‌ కొవిడ్‌ వ్యాధికారతను తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని, దీర్ఘకాల కరోనా ముప్పును తగ్గించేందుకు సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించాలని లాన్సెంట్‌ అభిప్రాయపడింది. లేదంటే ఇది ప్రజా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని