Nepal Plane Crash: తండ్రి వద్దన్నా విధులకు వెళ్లింది.. అంతలోనే..

Nepal Plane Crash: తన కూతురితో కలిసి ఇంట్లో పండగ చేసుకుందామని అనుకున్నాడు ఆ తండ్రి. అంతలోనే ఆ కుటుంబం విషాద వార్త వినాల్సి వచ్చింది.

Updated : 17 Jan 2023 14:05 IST

కాఠ్‌మాండూ: ‘ఈరోజు పనికి వెళ్లొద్దు. ఇంట్లో అందరం కలిసి పండగ చేసుకుందాం’.. అని కుమార్తెను కోరాడు ఆ తండ్రి. అందుకు నిరాకరించిన యువతి.. ‘ఇలా వెళ్లి అలా వస్తాను. తర్వాత అంతా కలిసి పండగ చేసుకుందాం’అంటూ విధులకు వెళ్లింది. అయితే ఆమె రాకకోసం ఎదురుచూస్తూ, పండగ ఏర్పాట్లలో మునిగిపోయిన ఆ కుటుంబం ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. రెండురోజుల క్రితం నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 

నేపాల్‌(Nepal)లో ఆదివారం 72 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఫ్లైట్‌ అటెండెంట్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల ఓషిన్‌ అలె మగర్‌ ఉన్నారు.

‘ఈ రోజు మాఘే సంక్రాంతి. విధులకు వెళ్లొద్దు.. ఇంట్లోనే అందరం కలిసి పండగ చేసుకుందామని ఉదయమే నా కుమార్తెకు చెప్పాను. అయితే ఆమె వినలేదు. రెండు విమాన సర్వీసుల్లో విధులు పూర్తి చేసుకొని వస్తానని పట్టుబట్టింది. ఇంతలోనే మరణ వార్త వినాల్సి వచ్చింది’ అని ఓషిన్‌ తండ్రి మోహన్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు.

భారత్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న ఓషిన్‌.. యతి ఎయిర్‌లైన్స్‌లో రెండేళ్లుగా పనిచేస్తోంది. కాట్‌మాండూలో కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అక్కడి సహారా ఎయిర్‌ హోస్టెస్‌ అకాడమీలో కోర్సు పూర్తి చేసింది. ఆమెకు రెండేళ్ల క్రితమే పెళ్లైంది. ఆమె భర్త ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఈ విషాదకర వార్త తెలియగానే ఆమె తల్లిదండ్రులు పోఖారాలోని ఘటనాస్థలికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇలా ఎన్నో విషాద గాథలు వెలుగులోకి వస్తున్నాయి. 

నేపాల్‌లోని పోఖారా నగరంలో ఆదివారం నేలకూలిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బ్లాక్‌ బాక్స్‌ సోమవారం లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఇది దొరికింది. ఈ విమానంలో గల 72 మందిలో 69 మంది భౌతికకాయాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు