Nepal Plane crash: పైలట్‌ తప్పిదమే.. 72 మంది ప్రాణాలు తీసింది..!

నేపాల్‌ (Nepal) విమాన ప్రమాదానికి (Plane Crash) మానవ తప్పిదమే కారణమా? పైలట్‌ పొరబాటు వల్లే విమానం కూలిపోయిందా? గత నెల చోటుచేసుకున్న ఈ ఘోర దుర్ఘటనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి.

Published : 17 Feb 2023 19:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేపాల్‌ (Nepal)లో గత నెల ఘోర విమాన ప్రమాదం జరిగి 72 మంది మృతిచెందిన దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలట్‌ తప్పిదం కారణంగానే ఆ ప్రమాదం (Plane Crash) సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పైలట్లలో ఒకరు పొరబాటుగా ఇంజిన్లకు అందే విద్యుత్‌ శక్తిని కట్‌ చేయడంతో విమానం కూలినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం.

జనవరి 15న యతి ఎయిర్‌లైన్స్‌ (Yeti Airlines)కు చెందిన విమానం కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారా బయల్దేరింది. విమానం ల్యాండ్‌ అవడానికి కొద్ది నిమిషాల ముందు సేతీ నదీ తీరంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 72 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై నేపాల్‌ (Nepal) అధికారులు దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు బయటపడ్డాయి. కాఠ్‌మాండూ నుంచి పొఖారాకు ప్రయాణ సమయం 25 నిమిషాలు మాత్రమే. మరో 5 నిమిషాల్లో విమానం ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

విమానం (Flight) స్పీడ్‌ను నియంత్రణలోకి తెచ్చి ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌.. కాక్‌పిట్‌లోని ఫ్లాప్స్‌ లెవర్స్‌ మార్చాలి. అయితే ప్రమాదం జరిగిన విమానంలోని ఒక పైలట్‌ వీటికి బదులుగా ఇంజిన్‌ లెవర్స్‌ను మార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఇంజిన్‌ విద్యుత్‌ శక్తి సున్నాకు పడిపోయినట్లు తేలింది. ఆ తర్వాతి క్షణానికే విమానం కుప్పకూలినట్లు దర్యాప్తులో తెలిసింది. ‘‘రెండు ఇంజిన్ల ప్రొపెల్లర్లు ఫీథర్డ్‌ పొజిషన్లలోకి వెళ్లడంతో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఇలా రెండు ఇంజిన్లు ఫీథర్డ్‌ స్థాయికి వెళ్లడం అరుదుగా జరుగుతుంది. ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతినిచ్చిన తర్వాత ఇంజిన్ల నుంచి విద్యుత్‌శక్తి రావడం లేదని ఫ్లయింగ్‌ పైలట్‌ గుర్తించాడు’’ అని దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆ నివేదిక వెల్లడించింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని