Nepal: నేపాల్‌ విమానం.. నేలకూలుతోన్న దృశ్యం వైరల్‌..!

నేపాల్‌లో విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తాజాగా ఈ విమానానికి సంబంధించి కుప్పకూలే క్షణాల ముందు తీసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 16 Jan 2023 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేపాల్‌లో విమాన దుర్ఘటన(Nepal Flight Crash) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని కాఠ్‌మాండూ(Kathmandu) నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారా(Pokhara)కు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలింది. ఈ క్రమంలోనే తాజాగా ఇదే విమానానికి సంబంధించిందిగా చెబుతోన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రమాదానికి క్షణాల ముందు ఆ లోహ విహంగం గాల్లో నియంత్రణ కోల్పోయి వేగంగా కిందికి పడిపోతున్నట్లు అందులో కనిపిస్తోంది. ఆ తర్వాత పెద్దఎత్తున శబ్దం వినిపించింది. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఓ భవనంపైనుంచి ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.

విమాన ప్రమాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం ‘జాతీయ సంతాప దినం’ ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపేందుకు నేపాల్‌ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 72 మంది ఉన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 విదేశీయులు. ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేశారు. ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం నుంచి ఎవరైనా బయటపడ్డారా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదని యతి ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని