Netanyahu: యుద్ధాన్ని ఆపే ఏ ఒప్పందాన్నీ అంగీకరించం

పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్ప గాజాలో శాశ్వతంగా యుద్ధాన్ని నివారించే ఏ ఒడంబడికను తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని అన్నారు.

Published : 25 Jun 2024 06:27 IST

పాక్షిక కాల్పుల విరమణకు మాత్రమే సిద్ధం
ఇకపై హెజ్‌బొల్లాపై దృష్టిపెడతాం: నెతన్యాహు

టెల్‌ అవీవ్‌: పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్ప గాజాలో శాశ్వతంగా యుద్ధాన్ని నివారించే ఏ ఒడంబడికను తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని అన్నారు. పాక్షిక ఒప్పందానికి మాత్రమే తాను సానుకూలమని తెలిపారు. గాజాలో పరిపాలన కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోమని చెప్పారు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన సాగుతుందని చెప్పారు. ఇజ్రాయెలీ టెలివిజన్‌ ఛానల్‌ 14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో కీలక వ్యాఖ్య కూడా నెతన్యాహు చేశారు. గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ముగింపునకు వచ్చిందని.. ప్రస్తుతం తీవ్రస్థాయిలో జరగడం లేదని.. ఇక తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్‌ మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లాపై దృష్టి పెడతామని చెప్పారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్‌ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి. 

వాణిజ్యనౌకలపై హూతీల దాడులు ఆగడం లేదు. అయితే ఈసారి గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో సూదూర ప్రాంతంలో ఉన్న వాణిజ్యనౌకపైనా యెమెన్‌ తిరుగుబాటుదారులు దాడి చేశారు. నౌకకు సమీపంలో పేలుడు సంభవించింది. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. దాడి విషయాన్ని బ్రిటన్‌ సైన్యానికి చెందిన యునైెటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రకటించింది. హూతీల నుంచి మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని