Netherlands: 14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్‌పై ఇంటికి..

Netherlands: 14 ఏళ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవలందించిన నేత పదవి నుంచి దిగిపోతూ సైకిల్‌పై వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 06 Jul 2024 18:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెదర్లాండ్స్‌ (Netherlands)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధానిగా డిక్‌ స్కూఫ్‌ ప్రమాణస్వీకారం చేశారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మార్క్‌ రుట్టే (Mark Rutte).. కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, అందరు నేతల్లా బందోబస్తు నడుమ కారులో కాకుండా సింపుల్‌గా సైకిల్‌పై తన సొంతింటికి వెళ్లిపోయారు. సైకిల్‌ నడుపుకుంటూ సిబ్బందికి టాటా చెబుతూ వీడ్కోలు పలికారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారాయి. ఈ వీడియోను రిటైర్డ్‌ పోలీసు అధికారిణి, పుదుచ్చేరి మాజీ గవర్నర్‌ కిరణ్‌ బేడీ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో మార్క్‌ రుట్టేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికార మార్పిడి ఇలా శాంతియుతంగా, ఆనందంగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

బ్రిటన్‌ నూతన ప్రధానికి మోదీ ఫోన్‌.. ‘ఎఫ్‌టీఏ’పై ఏమన్నారంటే..!

2010లో రుట్టే తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా ఆయనే పదవిలో కొనసాగుతూ వచ్చారు. అయితే, వలసలను నియంత్రించే విధానంపై సంకీర్ణ ప్రభుత్వంలో అంగీకారం కుదరలేదు. దీంతో గతేడాది జులైలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. రుట్టే ప్రధానిగా రాజీనామా చేయగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ బాధ్యతలు కొనసాగించారు.

గతేడాది చివర్లో నెదర్లాండ్స్‌లో ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం తప్పలేదు. అయితే, ప్రధాని పీఠంపై ఏకాభిప్రాయం కుదరడంలో ఆలస్యం కావడంతో చివరకు గత మంగళవారం డిక్‌ స్కూఫ్‌ అధికారికంగా పీఎం బాధ్యతలు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని