Ukraine Crisis: కమలాజీ.. ఈ సమయంలో మీకు నవ్వొస్తుందా..!

రష్యా దాడితో ఉక్రెయిన్‌ వాసులు ప్రాణభయంతో దేశం దాటి వలస వెళ్తున్నారు. సర్వం కోల్పోయి, నిస్సహాయ స్థితిలో శరణార్థులుగా తరలిపోతోన్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది.

Published : 13 Mar 2022 01:32 IST

వార్సా: రష్యా దాడితో ఉక్రెయిన్‌ వాసులు ప్రాణభయంతో దేశం దాటి వలస వెళ్తున్నారు. సర్వం కోల్పోయి, నిస్సహాయ స్థితిలో శరణార్థులుగా తరలిపోతోన్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది. ఇప్పుడు వారిని ఆదుకునే నాథుడెవరని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ను ప్రశ్నించగా.. ఆమె పెద్దగా నవ్వుతూ కనిపించారు. వార్సాలో పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దువాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ వైఖరి కనబర్చి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

నాటోలో భాగమైన తూర్పు ఐరోపా మిత్ర దేశాలకు మద్దతుగా కమలా హారిస్ పొలండ్ రాజధాని వార్సా వెళ్లారు. ఈ సమయంలో మీడియా సమావేశం జరిగింది. ఉక్రెయిన్‌ శరణార్థుల కోసం అమెరికా ప్రత్యేకించి చర్యలు తీసుకోనుందా.? అని కమలకు ప్రశ్న ఎదురైంది. అలాగే శరణార్థులకు సహకరించమని మీరు అమెరికాను అడగాలనుకుంటున్నారా..? అని పోలండ్ అధ్యక్షుడిని పాత్రికేయులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ముందుగా పోలండ్ అధ్యక్షుడు సమాధానం చెప్తారేమోనని హారిస్ ఆయనవైపు చూశారు. అనంతరం అవసరంలో ఆదుకున్న స్నేహితుడే నిజమైన స్నేహితుడని వ్యాఖ్యానిస్తూ.. కమలా హారిస్‌ కొన్ని క్షణాల పాటు గట్టిగా నవ్వారు. ఆ తర్వాత ఆండ్రెజ్‌ మాట్లాడుతూ.. శరణార్థుల కోసం కాన్సులర్ ప్రక్రియను వేగవంతం చేయమని హారిస్‌ను కోరినట్లు చెప్పారు. అయితే అమెరికా వారిని స్వీకరిస్తుందా..? అనే దానిపై మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు.

అక్కడి ప్రజలు అంత బాధలు ఎదుర్కొంటోన్న సమయంలో నవ్వడానికేముందంటూ ట్విటర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 80 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని ఇలాంటి మానవతా సంక్షోభం గురించి మాట్లాడేప్పుడు వేదికపై నవ్వడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.    


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని