Khosta-2: కొవిడ్‌-19 మాదిరి కొత్త వైరస్‌.. రష్యా గబ్బిలాల్లో గుర్తింపు

కొవిడ్‌-19 మాదిరి కొత్త వైరస్‌ (Khosta-2) రష్యా గబ్బిలాల్లో వెలుగు చూసినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 27 Sep 2022 01:42 IST

వాషింగ్టన్‌: రెండున్నరేళ్ల క్రితం చైనాలో వెలుగు చూసినట్లుగా అనుమానిస్తున్న కొవిడ్‌-19 (Coronavirus).. మహమ్మారిగా అవతరించి ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మాదిరి కొత్త వైరస్‌ (Khosta-2) రష్యా గబ్బిలాల్లో వెలుగు చూసినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఇన్‌ఫెక్షన్‌ గబ్బిలాల నుంచి మానవులకు సోకే సామర్థ్యం ఉందని తెలిపింది. ప్రస్తుతమున్న టీకాలు (Vaccines) ఈ వైరస్‌ను నిరోధించలేవని అమెరికా పరిశోధకుల అధ్యయనం పేర్కొంది.

‘రష్యా గబ్బిలాల్లో గుర్తించిన ‘ఖోస్తా-2’ వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ మానవ కణాలపై దాడి చేయగలదు. ప్రస్తుతం కొవిడ్‌-19 చికిత్సలో వినియోగిస్తోన్న యాంటీబాడీ థెరపీలకు ఇది లొంగకపోవచ్చు’ అని అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ (WSU) పరిశోధకులు పేర్కొన్నారు.

‘ఆసియా వెలుపలి వన్యప్రాణుల్లోనూ సార్స్‌ వైరస్‌లు వ్యాపిస్తున్నట్లు మా పరిశోధనలో వెల్లడైంది. పశ్చిమ రష్యా ప్రాంతంలో ఖోస్తా-2 వైరస్‌ గుర్తించాం. ప్రస్తుతం కొవిడ్‌-19 టీకా పంపిణీ ప్రక్రియతో జరుగుతుండగా మరో వైపు ప్రపంచ ఆరోగ్యానికి ఇదొక ముప్పుగా మారనుంది. ఖోస్తా-1, ఖోస్తా-2 వైరస్‌లు రష్యా గబ్బిలాల్లో 2020 ఏడాది చివర్లోనే గుర్తించినప్పటికీ తొలుత వాటివల్ల మానవులకు ముప్పు ఏమీ లేదని భావించాం. కానీ, వీటిపై విస్తృత పరిశోధనలు చేస్తోన్న సమయంలో మానవులకు సోకే అవకాశం ఉందని గుర్తించాం’ అని అధ్యయనకర్త మైఖేల్‌ లెట్కో పేర్కొన్నారు. ఖోస్తా-1తో మానవులకు స్వల్ప ప్రమాదమే ఉన్నప్పటికీ ఖోస్తా-లో మాత్రం ఇబ్బందికరమైన లక్షణాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కొవిడ్‌-19కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2, ఖోస్తా-2 రెండూ కరోనావైరస్‌ (Sarbecoviruses)కు చెందిన ఉపరకాలే. స్పైక్‌ ప్రొటీన్‌ సహాయంతో మానవ కణాల్లోకి వైరస్‌ ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో కేవలం కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకే కాకుండా సార్స్‌ తరగతికి చెందిన వైరస్‌లన్నింటినీ ఎదుర్కొనే యూనివర్సల్‌ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయాలనే విషయాన్ని తాజా అధ్యయనం సూచిస్తోందని నిపుణులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని