Published : 07 Jul 2022 11:38 IST

WHO: భారత్‌లో బీఏ.2.75 వేరియంట్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమందంటే..?

జెనీవా: అధిక సాంక్రమిక శక్తి ఉన్న ఒమిక్రాన్(Omicron) వేరియంట్‌ బీఏ.2కి ఉపరకమైన బీఏ.2.75ని భారత్‌ వంటి దేశాల్లో గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. దాని లక్షణాలను విశ్లేషిస్తున్నామని పేర్కొంది. ‘గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 30 శాతం మేర పెరిగాయి. డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన ఆరు సబ్‌ రీజియన్లలో నాలుగుచోట్ల గత వారం కేసుల పెరుగుదల నమోదైంది. బీఏ.4 బీఏ.5 రకాలు ఐరోపా, అమెరికాల్లో మహమ్మారి విజృంభణకు కారణమవుతున్నాయి. భారత్ సహా సుమారు పది దేశాల్లో బీఏ.2.75 ఉపరకం వెలుగులోకి వచ్చింది. పరిమిత స్థాయిలో జీనోమ్‌ సీక్వెన్సింగ్ జరుగుతుండటంతో దీని విశ్లేషణకు పూర్తి సమాచారం అందుబాటులో లేదు’ అని డబ్ల్యూహెచ్‌ఓ అధినేత టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గత వారం (జూన్‌ 27 నుంచి జులై 3 వరకు) 4.6 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే అంతకు ముందువారంతో పోల్చితే తాజాగా మరణాలు 12 శాతం మేర తగ్గాయని ప్రతివారం ఇచ్చే నివేదికలో డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మనదేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో లేదని గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో బీఏ.2.75 వేరియంట్ గురించి ఇటీవల అధికార వర్గాలు స్పందించాయి. ఈ ఉపరకం వ్యాప్తి భారత్‌లో పరిమితంగానే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇది తీవ్రస్థాయికి విస్తరిస్తున్నట్లు లేదా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని పెంచుతున్నట్లు ఇంతవరకు ఆధారాలు బయటపడలేదని తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ (సార్స్‌-కోవ్‌-2) ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండగా.. దీని ఉప రకాల్లో బీఏ.1ని అధిగమించి బీఏ.2 ఆందోళనకర స్థాయికి చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీఏ.2.75 కూడా ఇలాంటి ఉపరకమే. బీఏ.2కి రెండో తరంగా చెబుతున్న దీనికి కూడా సాంక్రమిక శక్తి ఎక్కువే. ఇటీవల దేశంలో కేసుల పెరుగుదలకు ఇదీ ఓ కారణం కావచ్చన్న ప్రచారం ఉంది. ఈ మేరకు ఇతర ఒమిక్రాన్‌ ఉపరకాల తీరుతెన్నులను నిరంతరం పర్యవేక్షిస్తుండటం కీలకమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని