Monkeypox: మంకీపాక్స్‌కు త్వరలోనే కొత్తపేరు.. కారణమిదే..!

మంకీపాక్స్‌ వ్యాధిపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో.. మంకీపాక్స్‌ అనే పేరుతో పిలవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Published : 23 Jun 2022 01:12 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారితో (Covid) వణికిపోతున్న వేళ.. ప్రపంచ దేశాలను మంకీపాక్స్‌ (Monkeypox) వైరస్‌ వెంటాడుతోంది. ఇప్పటికే 37 దేశాలకు వ్యాపించడంతోపాటు 2,600 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ఇలా ఈ వ్యాధిపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో మంకీపాక్స్‌ అనే పేరుతో పిలవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఒక ప్రాంతంపై వివక్షత (Discrimination) చూపించేలా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌కు కొత్త పేరును (New Name) నిర్ణయించే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిమగ్నమయ్యింది. మంకీపాక్స్‌ ప్రాబల్యం, పొంచివున్న ముప్పుతోపాటు పేరు మార్పుపై చర్చించేందుకు అంతర్జాతీయ నిపుణులు, భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యేందుకు సిద్ధమైంది.

అప్పట్లో ఆఫ్రికా.. ఇప్పుడు యూరప్‌

మంకీపాక్స్‌ వైరస్‌ను 1950ల్లో తొలుత కోతుల్లో గుర్తించారు. అనంతరం 1970లో కాంగో (డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్ కాంగో)లో ఓ తొమ్మిది నెలల బాలుడిలో కనుగొన్నారు. మానవుల్లో గుర్తించిన తొలి మంకీపాక్స్‌ కేసు కూడా అదే. అప్పటినుంచి 11 ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్‌ ప్రాబల్యం అధికంగా కొనసాగింది. అంతేకాకుండా ఏటా ఆఫ్రికాతోపాటు పశ్చిమ దేశాల్లోనూ ఎక్కడో ఒకచోట స్థానికంగా వెలుగు చూస్తూనే ఉంది. కానీ, ఈ ఏడాది మాత్రం.. ఇప్పటికే 37 దేశాలకు విస్తరించగా సుమారు మూడు వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 84 శాతం యూరప్‌లో, 12 శాతం అమెరికాలో ఉండగా కేవలం మూడు శాతం మాత్రమే ఆఫ్రికాలో నమోదయ్యాయి. ఇలా విస్తృత వేగంతో వ్యాపించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఆ పేరుతో పిలవొద్దు..

ఇలా ప్రపంచ దేశాలకు మంకీపాక్స్‌ విస్తరిస్తున్న వేళ.. దీని పేరుపై శాస్త్రవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఐరోపా, అమెరికా దేశాల్లో ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ పశ్చిమ ఆఫ్రికా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌, కాంగో ప్రాంతానికి చెందినట్లు పిలవడాన్ని శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. అంతేకాకుండా ఈమధ్య యూరప్‌లో కేసులు విస్తృతంగా బయటపడుతున్నప్పటికీ గతంలో ఆఫ్రికన్‌ రోగుల ఫొటోలను మాత్రమే విడుదల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆఫ్రికాకు చెందిన 30 మంది శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇటీవల లేఖ రాసింది. ఈ వైరస్‌ ఒక ప్రాంతానికి చెందినదిగా పేర్కొనడం సమంజసం కాదని.. వివక్షత లేని పేరును సూచించాలని అందులో పేర్కొంది. కొవిడ్‌-19తో పాటు అంతకుముందు విలయం సృష్టించిన ప్రాణాంతక వైరస్‌లను ప్రాంతాలకు అతీతంగా పేర్లను మార్పుచేయడాన్ని శాస్త్రవేత్తల బృందం గుర్తుచేసింది. ఇందుకు స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ పేరు మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

ఏమిటీ వైరస్‌..?

మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్‌ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. కేవలం 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని