Russia-North Korea: రష్యా-ఉత్తర కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం

రష్యా, ఉత్తర కొరియాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్‌ పుతిన్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు.

Published : 20 Jun 2024 06:26 IST

సంతకాలు చేసిన పుతిన్, కిమ్‌
శత్రుదేశాలు దాడి చేస్తే సహకరించుకోవాలని నిర్ణయం

సియోల్‌: రష్యా, ఉత్తర కొరియాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్‌ పుతిన్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని; భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒడంబడికలో పేర్కొన్నారు. వీటితోపాటు ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్‌ విభాగాల్లో ఇరు దేశాలు సహాకారం అందించుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. పశ్చిమ దేశాలతో ఈ రెండు దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తాజా భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. కిమ్‌ ఆహ్వానం మేరకు ఉత్తర కొరియా పర్యటన నిమిత్తం పుతిన్‌ మంగళవారం రాత్రి ఆ దేశ రాజధాని ప్యాంగాంగ్‌కు చేరుకున్నారు. ఉత్తర కొరియా పర్యటన అనంతరం పుతిన్‌ వియత్నాం చేరుకున్నారు.

కిమ్‌కు విలాసవంతమైన కారు బహూకరణ

పుతిన్‌ తన ఉత్తర కొరియా పర్యటన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు కిమ్‌కు తమ దేశంలో అత్యంత విలాసవంతమైన ఆరస్‌ లగ్జరీ కారును బహూకరించారు. ఈ సందర్భంగా కిమ్‌ కూడా పుతిన్‌కు పలు విలువైన బహుమతులను అందించారు. గత ఫిబ్రవరిలో కిమ్‌ మాస్కో పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇటువంటి కారునే పుతిన్‌ ఆయనకు బహుమతిగా అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని