Covid Voice test: స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ సాయం.. గొంతు విశ్లేషణతో కొవిడ్‌ నిర్ధారణ..!

వైరస్‌ సోకిన విషయాన్ని స్మార్ట్‌ఫోన్లలోనే క్షణాల్లో పసిగట్టే ‘యాప్‌’ను నిపుణులు రూపొందించారు.

Published : 06 Sep 2022 01:31 IST

కృత్రిమ మేధ సహాయంతో యాప్‌ రూపొందించిన పరిశోధకులు

లండన్‌: కరోనా వైరస్‌ (Corona Virus) మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.  పలు దేశాల్లో వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతుండగా.. వైరస్‌ నిర్ధారణను మరింత వేగంగా చేపట్టిందుకు సాంకేతికత వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వైరస్‌ సోకిన విషయాన్ని స్మార్ట్‌ఫోన్లలోనే క్షణాల్లో పసిగట్టే ‘యాప్‌’ను నిపుణులు రూపొందించారు. కృత్రిమ మేధ సహాయంతో పౌరుల గొంతును విశ్లేషించి కొవిడ్‌-19ను క్షణాల్లో నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా కరోనా వైరస్‌ శ్వాసకోశ మార్గాలు, స్వరతంత్రుల్లో ప్రభావం చూపుతుంది. ఇది వ్యక్తి గొంతులో మార్పులకు దారితీస్తుందని నిపుణులు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు గాను నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గొంతును విశ్లేషించేందుకు (Voice Analysis) ఉపయోగించే మెల్‌-స్పెక్ట్రోగ్రామ్‌ (Mel-spectrogram) సాంకేతికతను ఉపయోగించారు. మూడు సార్లు దగ్గడం, నోటి నుంచి మూడు నుంచి ఐదుసార్లు బిగ్గరగా శ్వాస తీసుకోవడం చేయాలని వాలంటీర్లకు సూచించి.. వాటి ఆడియోలను రికార్డుచేశారు. వాటిని యూనివర్సిటీకి చెందిన క్రౌడ్‌ సోర్సింగ్‌ కొవిడ్‌ సౌండ్స్‌ యాప్‌లో ఉన్న 893 ఆడియో శాంపిళ్లతో విశ్లేషించారు. ఈ ప్రక్రియలో 308 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించిన పరిశోధకులు.. ఈ కొత్త యాప్‌ 89శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయన్నారు.

కృత్రిమ మేధ సహాయంతో పనిచేసే ఈ యాప్‌.. కొవిడ్‌ను నిర్ధారించడంలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల కంటే కచ్చితమైన ఫలితం ఇవ్వడంతోపాటు చౌకగా ఉండనుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఖరీధైన పీసీఆర్‌ టెస్టులను భరించలేని పేద దేశాల్లో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అయితే, లక్షణాలు లేని వాళ్లలో మాత్రం ఇన్‌ఫెక్షన్‌ను అంత కచ్చితంగా గుర్తించలేక పోతున్నాయని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని