china: చైనా అధ్యక్షుడిగా మూడోసారి షీజిన్‌పింగ్‌.. కొత్త ప్రీమియర్‌గా లీ కియాంగ్‌..!

చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ విధేయుడిగా పేరున్న లీ కియాంగ్‌ దేశ ప్రధాని పదవి దక్కింది. ఇప్పటికే ఆ స్థానంలో ఉన్న లీ కెకియాంగ్‌ (67) రెండుసార్లు పదవి కాలం పూర్తికావడంతో ఆయనకు ఉద్వాసన పలికారు. ఇక జిన్‌పింగ్‌ మూడో పర్యాయ అధ్యక్షుడిగా ప్రకటించుకొన్నారు.

Updated : 23 Oct 2022 10:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా అధ్యక్షుడు, పార్టీ జనరల్‌ సెక్రటరీగా షీ జిన్‌పింగ్‌ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని నేటి మీడియా సమావేశంలో ఆయనే స్వయంగా ప్రకటించుకొన్నారు. ఇక  సరికొత్త ప్రీమియర్‌ (ప్రధాని)ను ఎన్నుకొన్నారు. షాంఘైలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్‌ను ఈ పదవిలోకి ఎంపిక చేశారు. షీ జిన్‌పింగ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కియాంగ్‌ పేరును ప్రకటించారు. దీంతోపాటు  పార్టీ  పొలిట్‌బ్యూరో.. స్టాండింగ్‌ కమిటీ కొత్త సభ్యల పేర్లను కూడా వెల్లడించారు. ఈ కమిటీలో షీ జిన్‌పింగ్‌, లీ కియాంగ్‌తోపాటు ఝావో లిజి, వాంగ్‌ హునింగ్‌, కాయి కి, డింగ్‌ షూషాంగ్‌, లీషీకు స్థానం కల్పించారు. 

ఈ మీడియా సమావేశంలో షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ నిన్న పార్టీ కాంగ్రెస్‌ సమావేశాలను విజయవంతంగా ముగించామన్నారు. పార్టీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఉంచామని.. పార్టీని భవిష్యత్తులో మరింత సమష్టిగా నడపడానికి బలాలను సమ్మిళితం చేశామని వివరించారు. అంతర్జాతీయ సమాజం తమ పార్టీ కాంగ్రెస్‌ సమావేశాలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు. వివిధ దేశాల అధిపతులు అభినందిస్తూ సందేశాలు పంపుతున్నట్లు షీ జిన్‌పింగ్‌ వెల్లడించారు. వారికి తన ధన్యవాదాలను తెలిపారు. తమ బృందంపై నమ్మకం ఉంచినందుకు పార్టీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. చైనాను అన్నిరకాలుగా ఆధునిక సోషలిస్టు దేశంగా మార్చేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తామన్నారు. 

ఎవరీ లీ కియాంగ్‌..?

63 ఏళ్ల లీ కియాంగ్‌ సీసీపీ షాంఘై విభాగం కార్యదర్శి. షీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన ఈ ఏడాది షాంఘైలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ విధించారు. గతంలో ఝిజియాంగ్‌ ప్రావిన్స్‌లో షీ జిన్‌పింగ్‌తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జిన్‌పింగ్‌ తర్వాత స్థానంలోకి కియాంగ్‌ చేరుకొన్నారు.

కొన్నేళ్లుగా అత్యున్నత స్థాయి స్టాండింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్న నలుగురు కీలక నేతలు తిరిగి ఎన్నికయ్యే అవకాశాన్ని కోల్పోయారు. వీరిలో ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌ (67), నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ లీ ఝాన్సు(72), చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ వాంగ్‌ యాంగ్‌(67), ఉప ప్రధాని హాన్‌జెంగ్‌ (68) ఉన్నారు. కేంద్ర కమిటీకి ఎన్నుకోకపోవడంతో వీరికి పొలిట్‌బ్యూరోలో, స్టాండింగ్‌ కమిటీలో స్థానం దక్కదు. ప్రస్తుత ప్రభుత్వ హోదాల నుంచీ తప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పటి వరకూ దేశ పాలనా వ్యవహారాల్లో కీలకమైన సీనియర్లలో అత్యధికులను జిన్‌పింగ్‌ పథకం ప్రకారం పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని