Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్‌ సంస్థ!

న్యూజిలాండ్‌ (New Zealand)కు చెందిన ఓ విమానయాన సంస్థ లగేజ్‌తోపాటు ప్రయాణికుల శరీర బరువును సైతం లెక్కించనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్‌ వెయిట్‌ సర్వే (Passenger Weight Survey) పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక సర్వే ద్వారా ప్రయాణికుల శరీర బరువును లెక్కించనున్నట్లు తెలిపింది.

Published : 31 May 2023 01:19 IST

వెల్లింగ్టన్‌: విమాన ప్రయాణాల్లో ప్యాసింజర్ల(Flight Passengers) బ్యాగేజ్‌ బరువుపై పరిమితులు ఉంటాయి. ఈ నిబంధనల్లో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు (Flight Services) మధ్య వ్యత్యాసం ఉంటుంది. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌ ఇచ్చే సమయంలో చెక్‌-ఇన్‌ కౌంటర్‌ వద్ద బ్యాగేజ్‌ బరువు ఎంత ఉందనేది చెక్‌ చేస్తారు. అయితే, ఓ విమానయాన సంస్థ బ్యాగేజ్‌ బరువుతోపాటు ఇకపై ప్రయాణికుల శరీర బరువును కూడా లెక్కించనున్నట్లు తెలిపింది. 

న్యూజిలాండ్‌ (New Zealand)కు చెందిన ఎయిర్‌ న్యూజిలాండ్‌ (Air New Zealand) అనే విమానయాన సంస్థ జూన్‌ 2 నుంచి ప్రయాణికుల లగేజ్‌తోపాటు వారి శరీర బరువును సైతం లెక్కించనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్‌ వెయిట్‌ సర్వే (Passenger Weight Survey) పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక సర్వే ద్వారా ప్రయాణికుల శరీర బరువును లెక్కించనున్నట్లు తెలిపింది. దీనివల్ల విమానం గాల్లోకి లేవడానికి ముందే పైలట్‌కు ప్రయాణికుల సగటు బరువు ఎంతనేది తెలుస్తుందని పేర్కొంది. ఇందుకోసం ఆక్లాండ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Auckland International Airport)లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 

‘‘ మేం విమానంలోకి వెళ్లే ప్రతి వస్తువు బరువునూ లెక్కిస్తాం. ప్రయాణికులకు అందించే ఆహారం, ప్రయాణికులు, విమాన సిబ్బంది లగేజీని కూడా. ఇకపై ప్రయాణికుల బరువును సైతం లెక్కించాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేపట్టాం. ప్రయాణికుల అనుమతి లేకుండా వారి శరీర బరువును కొలవం. ఇది పూర్తిగా స్వచ్ఛందమే. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. బరువు కొలిచే యంత్రం మీద నిలబడటం కొంత మందికి ఇబ్బందికరంగానే ఉంటుంది. మేం ప్రయాణికులకు హామీ ఇస్తున్నాం. వారి బరువును విమానాశ్రయ సిబ్బంది ఎవరు చూడలేరు. కేవలం పైలట్‌కు మాత్రమే విమానంలో మొత్తం ప్రయాణికుల శరీర బరువు ఎంతనేది తెలుస్తుంది’’ అని ఎయిర్‌ న్యూజిలాండ్‌ సంస్థ తెలిపింది. గతంలో కూడా ఈ సంస్థ దేశీయ విమానయాన ప్రయాణికులు బరువును లెక్కించేందుకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఐదేళ్లపాటు కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని