Jacinda Ardern: న్యూజిలాండ్‌ ప్రధాని అనూహ్య ప్రకటన.. రాజీనామా చేసిన జెసిండా

రాజీనామా ప్రకటించి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌(Jacinda Ardern) ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. తన ప్రకటన వెనక ఎలాంటి రహస్యం లేదని ఆమె వ్యాఖ్యానించారు. 

Updated : 19 Jan 2023 10:50 IST

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్(New Zealand) ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌(Jacinda Ardern) అనూహ్య ప్రకటన చేశారు. రాజీనామా ప్రకటించి షాక్‌ ఇచ్చారు. ప్రగతిశీల పాలనకు పేరుపొందిన ఆమె.. ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. కరోనా కల్లోలం, అత్యంత దారుణస్థాయిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇలాంటి ఆమె..తన రాజీనామాకు ఇదే తగిన సమయమని వెల్లడించారు.   

‘నేనొక మనిషిని. మనం చేయగలినంత కాలం  చేస్తాం. తర్వాత సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం. ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైంది. అయితే, అది అత్యంత సవాలుతో కూడుకున్న పని. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు కొనసాగలేం. మీరు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తా..? కాదా..? అనేది తెలుసుకోవడం కూడా ఒక బాధ్యతే. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావించడం వల్ల నేను ఈ పదవిని వీడటం లేదు. ఎందుకంటే మనం విజయం సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ లేబర్ పార్టీ సభ్యులతో మాట్లాడారు. తన రాజీనామా వెనక ఎలాంటి రహస్యం లేదని వ్యాఖ్యానించారు.

2017లో ఆమె మొదటిసారి న్యూజిలాండ్ ప్రధానిగా నియమితులయ్యారు. సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఇక 2020లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని విజయతీరాలకు నడిపించారు. తాజాగా రాజీనామా ప్రకటించిన ఆమె.. ఫిబ్రవరి ఏడు వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది  అక్టోబర్‌ 14న జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. మరోపక్క ఈ సమయం వరకు కొత్త ప్రధానిని జనవరి 22న ఎన్నుకోనున్నారు. 

ప్రస్తుతం ఆమె ప్రభుత్వం ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయినట్లు వెల్లడైంది. ఇదిలా ఉంటే.. 2019లో క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని మసీదుపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె వ్యహరించిన తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఆ ఘటనలో 51 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడ్డారు. ఆ హింసాకాండకు ఆమె ఎంతగానో చలించిపోయారు. అలాగే ప్రకృతి విపత్తు, కరోనా కల్లోలాన్ని ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని