New year 2023: మరో ఏడాది వచ్చేసింది.. ఆ దేశాలు 2023లోకి అడుగుపెట్టేశాయ్‌..!

మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. భారతీయులు కొత్త  ఏడాది కోసం ఎదురుచూస్తుండగా.. కొన్ని దేశాలు ఇప్పటికే నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాయి. 

Updated : 31 Dec 2022 17:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాత సంవత్సరం ఇచ్చిన జ్ఞాపకాలను తలచుకుంటూ.. కొత్త ఆశలు, లక్ష్యాలతో మరో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. కరోనా కొత్త వేరియంట్లతో గత రెండు సంవత్సరాలు కాస్త బోసిపోయిన వేడుకలు ఈసారి అంబరాన్నంటేందుకు వేచి చూస్తున్నాయి. అయితే మనకంటే ముందే కొన్ని ప్రాంతాలు కొత్త ఏడాదిని ఆహ్వానించాయి. పసిఫిక్‌ మహా సముద్రంలోని కిరిబాటి దీవులు కూడా కొత్త ఏడాదిని స్వాగతించాయి. వాస్తవానికి ప్రతి ఏడాది ‘సమోవా’ ద్వీపం కొత్త ఏడాదిని అందరి కంటే ముందే ఆహ్వానిస్తుండగా.. ఈసారి వారు టైమ్‌ జోన్‌ను మార్చుకున్నారు. దీంతో ఎప్పటికంటే గంట ఆలస్యంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. అలా ఈ ఏడాది అందరి కంటే ముందుగా కిరిబాటి దీవులు నూతన సంవత్సరంలోకి వెళ్లింది.

న్యూజిలాండ్‌లో మొదలైన కొత్త ఏడాది

న్యూజిలాండ్‌ వాసులు కూడా 2023లోకి అడుగుపెట్టారు. భారత్‌లో కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశం కొత్త ఏడాదిని స్వాగతించింది. ఆనందోత్సాహాల మధ్య కివీస్‌ ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాయి. ఆక్లాండ్‌ స్కై టవర్‌ వద్ద న్యూఇయర్‌ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. బాణసంచా వెలుగులతో స్కైటవర్‌ వర్ణ రంజితమైంది. 

ఏయే దేశాల్లో ఎప్పుడు..

ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు నూతన సంవత్సరం మొదలవుతుంది. 

ఇక సూర్యోదయ భూమిగా పేరున్న జపాన్‌ కూడా మూడున్నర గంటల ముందే 2023లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భారత్‌ పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.

ఒకేసారి 43 దేశాల్లో..

సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2023లోకి అడుగుపెడతాం. అదే సమయానికి భారత్‌తో పాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.

చివరగా అక్కడే..

భారత్‌ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. ఇక కొత్త సంవత్సరం ఆఖరిగా వచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని బేకర్‌, హోవార్డ్‌ దీవులు. అయితే ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అమెరికన్‌ సమోవాను చివరిదిగా పరిగణిస్తారు.

ఇవి ప్రత్యేకం..

రష్యాలో నూతన సంవత్సర వేడుకలను రెండుసార్లు జరుపుకొంటారు. ఒకటి జనవరి 1 (కొత్త క్యాలెండర్‌ ప్రకారం). రెండోది జనవరి 14 (పాత జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం). ఇక నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోని దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, వియత్నాం ఉన్నాయి. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్‌ వేడుకలు జరుగుతాయి.

చెప్పాలంటే ఈ సంవత్సరం కూడా ప్రపంచాన్ని కొవిడ్ భయాలు పూర్తిగా వీడలేదు. చైనాలో కొత్త వేరియంట్లు ఉద్ధృతి చూపిస్తున్నాయి. జపాన్‌, అమెరికా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. దాంతో పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తోన్న సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని