Nirav Modi: నా దగ్గర డబ్బు లేదు..నెలకు రూ.10 లక్షలు అప్పు తీసుకుంటున్నా..!

భారత్‌లోని ప్రభుత్వ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(Nirav Modi) వద్ద చిల్లిగవ్వ లేదట. ఈ విషయాన్ని ఆయన బ్రిటన్‌లోని కోర్టుకు వెల్లడించాడు. 

Published : 11 Mar 2023 16:15 IST

లండన్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(PNB)ను రూ.11వేల కోట్ల మేర మోసగించిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(Nirav Modi) వద్ద డబ్బులేదట. చట్టపరమైన ఖర్చులు, జరిమానాలను చెల్లించేందుకు డబ్బులు అప్పు తీసుకుంటున్నాడట. 

దేశం విడిచి పారిపోయిన ఈ ఆర్థిక నేరగాడు లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైల్లో ఉన్నాడు. అతడిని భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి బర్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు నీరవ్‌(Nirav Modi) ఇటీవల వర్చువల్‌గా హాజరయ్యాడు. హైకోర్టు ఆదేశించిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేనని, నెలకు 10 వేల పౌండ్ల చొప్పున కడతానని అభ్యర్థన పెట్టుకున్నాడు. ఆ 10 వేల పౌండ్లను ఎక్కడి నుంచి తెస్తావని న్యాయమూర్తి అడగ్గా.. తన దగ్గర డబ్బు లేదని, కోర్టుకు చెల్లించాల్సిన మొత్తం కోసం రుణం తీసుకుంటున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం తన ఆస్తులన్నీ సీజ్‌ చేయడంతో డబ్బుకోసం ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు.   

పీఎన్‌బీ(PNB)ని వేల కోట్ల రూపాయలు మోసగించిన కేసులో భారత్‌కు అప్పగించే విషయంలో గత ఏడాది నీరవ్‌కు చుక్కెదురైంది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు అనుకూలంగా లండన్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే ఈ తీర్పుపై యూకే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు నీరవ్‌కు అనుమతి లభించలేదు. అయితే భారత్‌కు రాకుండా ఉండేందుకు ఆయనకు ఇంకా మార్గాలున్నట్లు తెలుస్తోంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని