Nirav Modi: నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించవచ్చు: లండన్‌ హైకోర్టు తీర్పు

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోదీను లండన్‌ను రప్పించేందుకు కీలక ముందడుగు పడింది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై నీరవ్‌ చేసిన అప్పీల్‌ను యూకే కోర్టు తోసిపుచ్చింది.

Published : 10 Nov 2022 01:18 IST

లండన్‌: భారతీయ బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి బ్రిటన్‌ న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. మానసిక అనారోగ్యం దృష్ట్యా తనను భారత్‌కు అప్పగించొద్దంటూ నీరవ్‌ చేసిన అప్పీల్‌ను లండన్‌ హైకోర్టు తిరస్కరించింది. ఆత్మహత్య చేసుకునే ముప్పు కారణంతో ఆయనను భారత్‌కు అప్పగించకుండా ఉండటం సరికాదని తేల్చి చెప్పింది.

నీరవ్‌ను భారత్‌కు అప్పగించడానికి సమ్మతిస్తూ గతేడాది అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నీరవ్‌ లండన్‌ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్‌పై ఈ ఏడాది ఆరంభం నుంచి విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. నీరవ్‌ అప్పగింతకు అనుకూలంగా వెస్ట్‌మినిస్టరన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పు సబబే అని హైకోర్టు సమర్థించింది. నీరవ్‌ మానసిక పరిస్థితి సరిగానే ఉందని, భారత జైల్లో ఆయన ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉన్నందున ఆయన అప్పగింత అన్యాయం లేదా అణచివేత అవుతుందనే ఆరోపణలను తాము వ్యతిరేకిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు ఆయన చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చింది.

అయితే, ఈ తీర్పుతో నీరవ్‌ అప్పగింతకు కీలక ముందడుగు పడినప్పటికీ.. భారత్‌కు రాకుండా ఉండేందుకు ఆయనకు ఇంకా అవకాశాలున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పును 14 రోజుల్లోగా నీరవ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయొచ్చు. అక్కడ కూడా ఆయనకు ప్రతికూల నిర్ణయం వెలువడితే.. యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ నుంచి 39వ రూల్‌ను కోరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ అవకాశంతో నీరవ్‌ తనను భారత్‌కు అప్పగించకుండా ప్రభుత్వానికి వినతి చేసుకోవచ్చు. దీంతో నీరవ్‌ను భారత్‌కు రప్పించే విషయంలో సందిగ్ధం వీడడానికి మరికొంత కాలం పట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని