Kailasa: ‘కైలాస.. సరిహద్దులు లేని దేశం..!’

కైలాస (Kailasa) పేరుతో ప్రత్యేక దేశం ఉందంటూ నిత్యానంద చేస్తోన్న ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. వీటిపై స్పందించిన కైలాస ప్రతినిధులు.. భౌగోళికంగా అటువంటి దేశమేదీ లేదని.. తమది హద్దులు లేని దేశమని పేర్కొన్నారు.

Updated : 23 Mar 2023 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాదాస్పద స్వామి నిత్యానంద ప్రతినిధులమంటూ ఐక్యరాజ్య సమితిలో కొందరు చేసిన ప్రసంగం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాము కైలాస దేశానికి చెందిన వ్యక్తులమని.. అమెరికాతోపాటు అనేక నగరాలతో పలు ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ ప్రకటనలపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతోపాటు ‘కైలాస’ పేరుతో ఓ దేశం కూడా ఉందా..? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ‘కైలాస’ ప్రతినిధులు స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఆ పేరుతో భౌగోళికంగా దేశం ఏదీ లేదని.. తమది సరిహద్దులు లేని సేవా ఆధారిత దేశమని పేర్కొన్నారు.

కైలాస దేశం ఎక్కడుంది..? జనాభా ఎంత..? ఎప్పుడు స్థాపించారు..? అనే ప్రశ్నలకు నిత్యానంద ప్రతినిధులు బదులిస్తూ.. ‘ప్రాచీన హిందూ నాగరికత పునరుద్ధరణకు కృషి చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఐరాస గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. సావరిన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మాల్టా (భౌగోళికంగా లేనప్పటికీ దేశంగా గుర్తింపు) దేశం స్ఫూర్తితో సరిహద్దులు లేని సేవా ఆధారిత దేశం మాది. కుల, మత, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరి ఆనందమే మా ధ్యేయం’ అని పేర్కొన్నారు.

ఆ దేశాన్ని ఎలా సందర్శించాలి, దేశంగా ప్రకటించుకోవడానికి ఎటువంటి రుజువులు  ఉన్నాయి..? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సావరిన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మాల్టా మాదిరిగానే కైలాస కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలతోపాటు వివిధ దేశాల్లో ఉన్న మఠాల ద్వారా వ్యవహారాలు కొనసాగిస్తుంది’ అని వివరణ ఇచ్చారు.

ఈక్వెడార్‌ ప్రాంతంలో సొంతంగా ద్వీపముందని నిత్యానంద చెప్పడంపైనా వివరణ ఇచ్చిన ప్రతినిధులు.. నిత్యానంద అలా ఎప్పుడూ చెప్పలేదన్నారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో విదేశాలకు ఎందుకు వెళ్లారన్న ప్రశ్నకూ సమాధానమిస్తూ.. అది తప్పుడు కేసు అని కైలాస ప్రతినిధులు వెల్లడించారు. ఎంతోమంది మానవ హక్కుల న్యాయవాదులు, ప్రముఖులు దీంతో ఏకీభవించారని అన్నారు. మీడియాలో ఆయన్ను మంత్రగాడిగా చిత్రీకరిస్తున్నారనే విషయంపై స్పందించిన ప్రతినిధులు.. అది అవమానకరమని, ఆయన పరువుకు భంగం కలిగించేదంటూ సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని