India-China Talks: భారత్‌- చైనా చర్చల్లో పురోగతి లేదు.. ఉమ్మడి ప్రకటన విడుదల

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం భారత్‌- చైనా మధ్య నిర్వహించిన 14వ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో పురోగతి రాలేదని ఇరుపక్షాలు గురువారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే.. దగ్గరి సంబంధాలు కొనసాగించాలని, ఈ సమస్యలపై...

Published : 14 Jan 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం భారత్‌- చైనా మధ్య నిర్వహించిన 14వ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో పురోగతి రాలేదని ఇరుపక్షాలు గురువారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే.. దగ్గరి సంబంధాలు కొనసాగించాలని, ఈ సమస్యలపై పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాల కోసం మున్ముందూ చర్చలు జరపాలని అంగీకరించాయి. ఈ విడత చర్చల్లో తూర్పు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్య పరిష్కారం కాగలదని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బుధవారం చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చర్చల్లో పురోగతి లేదంటూ తాజాగా ప్రకటన వెలువడటం గమనార్హం.

‘ఈ సమావేశానికి ఇరుపక్షాల రక్షణ, విదేశాంగశాఖల ప్రతినిధులు హాజరయ్యారు. పశ్చిమ సెక్టార్(లద్దాఖ్ సరిహద్దు)లో ఎల్‌ఏసీ వెంబడి సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన, లోతైన అభిప్రాయాలను పంచుకున్నారు’ అని ఆ ప్రకటనలో భారత్‌, చైనా పేర్కొన్నాయి. ఈ క్రమంలో వారివారి ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను అనుసరించాలని, మిగిలిన సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా కృషి చేయాలని అంగీకరించాయి. తాజా చర్చలు.. లద్దాఖ్‌ సెక్టార్‌లో ఎల్‌ఏసీ వెంబడి ప్రశాంతతను పునరుద్ధరించడానికి, ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సాధించడానికి సహాయపడతాయని భావిస్తున్నట్లు చెప్పాయి. ఈ క్రమంలో తదుపరి రౌండ్ చర్చలు వీలైనంత త్వరగా జరగాలని ఆకాంక్షించాయి. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో జరిగిన 13వ రౌండ్ చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉమ్మడి ప్రకటన కూడా రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని