Ukraine Crisis: ఒడెస్సా పోర్టుపై రష్యా దాడులు..!

నల్లసముద్రంలోని ఉక్రెయిన్‌ కీలక ఓడరేవు నగరం ఒడెస్సాపై రష్యా భారీగా దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ తన టెలిగ్రామ్‌ ఛానెల్‌లో ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Published : 03 Apr 2022 14:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నల్ల సముద్రంలోని ఉక్రెయిన్‌ కీలక ఓడరేవు నగరం ఒడెస్సాపై రష్యా భారీగా దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ తన టెలిగ్రామ్‌ ఛానల్‌లో ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం క్షిపణులతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు జెలెన్‌స్కీ-పుతిన్‌ మధ్య భేటీ జరిగే స్థాయిలో ఉక్రెయిన్‌తో చర్చలు పురోగమించలేదని రష్యా ప్రతినిధి వ్లాదిమిర్‌ మెడెన్స్కీ వెల్లడించారు. క్రిమియా, డాన్‌బాస్‌ విషయంలో రష్యా విధానంలో ఎటువంటి మార్పు లేదని ఆయన తేల్చిచెప్పారు.

నేటి ఉదయం ఆరుగంటల సమయంలో నల్లసముద్రం ఒడ్డున ఉన్న ఒడెస్సాలోని మూడు చోట్ల పేలుళ్లు జరిగి దట్టమైన పొగ వ్యాపించింది. దాదాపు పదిలక్షల జనాభా ఉన్న ఈ కీలకమైన ఓడరేవు నగరం ఇప్పటికీ ఉక్రెయిన్‌ ఆధీనంలోనే ఉంది. ఉక్రెయిన్‌కు నల్ల సముద్రం, అజోవ్‌ సముద్రంతో సంబంధాలు లేకుండా ఉండేందుకు రష్యా తీవ్ర యత్నాలు చేస్తోందని గత వారం బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. సముద్ర మార్గం నుంచి యాంఫీబీయస్‌ దాడులు చేసేలా రష్యా ఏర్పాట్లు చేసుకొంటోందని.. కానీ, ఉక్రెయిన్‌ సేనలు సిద్ధంగా ఉంటే మాత్రం భారీ నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.

మరోపక్క ఎటువంటి దాడులను అయినా ఎదుర్కొనేందుకు ఒడెస్సా నగరం కొన్ని వారాల నుంచి సిద్ధమవుతోంది. ఈ నగరంలో వీధులను ట్యాంక్‌ ట్రాప్‌లతో నింపేశారు. దీంతోపాటు ప్రధాన కట్టడాలకు ఇసుక మూటలతో రక్షణ కవచాలను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని