Ukraine Crisis: అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన అవసరం లేదు: రష్యా

ఉక్రెయిన్‌(Ukraine)లో తమకు అణ్వాయుధాలు(Nuclear Weapons) ప్రయోగించాల్సిన అవసరం లేదని రష్యా(Russia) రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగు(Sergei Shoigu) తెలిపారు...

Published : 17 Aug 2022 00:49 IST

మాస్కో: ఉక్రెయిన్‌(Ukraine)లో తమకు అణ్వాయుధాలు(Nuclear Weapons) ప్రయోగించాల్సిన అవసరం లేదని రష్యా(Russia) రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగు(Sergei Shoigu) తెలిపారు. ఆ దేశంలో రష్యా తన రసాయన(Chemical Weapons), అణ్వాయుధాలను మోహరించవచ్చనే ఊహాగానాలను అబద్ధాలుగా కొట్టిపారేశారు. ‘మిలిటరీ కోణంలో.. నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. రష్యా అణ్వాయుధాల ప్రధాన ఉద్దేశం.. అణు దాడిని అరికట్టడమే’ అని మాస్కో(Moscow)లో నిర్వహించిన అంతర్జాతీయ భద్రతా సమావేశంలో షొయిగు వ్యాఖ్యానించారు.

‘ఉక్రెయిన్‌లో చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యలో రష్యా తన వ్యూహాత్మక అణ్వాయుధాలు, రసాయన ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియా ఊహాగానాలు ప్రచారం చేస్తోంది. ఇవన్నీ అబద్ధాలే’ అని షొయిగు పేర్కొన్నారు. మరోవైపు.. ఉక్రెయిన్ సైనిక కార్యకలాపాలను అమెరికా, బ్రిటన్‌లు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ దేశాలు.. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, వాటి వినియోగంలో సహాయపడటంతోపాటు ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని చేరవేశాయన్నారు. ఈ క్రమంలోనే తూర్పు, మధ్య ఐరోపాలో ‘నాటో’ తన బలగాల విస్తరణను అనేక రెట్లు పెంచిందని పేర్కొన్నారు.

అమెరికా, రష్యాల మధ్య పరస్పర అణ్వాయుధాల నియంత్రణకు ఉద్దేశించిన స్టార్ట్‌ ఒప్పందాన్ని(START Treaty) ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం దీని చుట్టూ పరిస్థితులు సంక్లిష్టంగా మారుతోన్నాయన్నారు. అయితే, రష్యా ఈ ఒప్పందానికి లోబడే ఉందని.. నిర్ణయించిన స్థాయిలోనే వార్‌హెడ్‌ల నిర్వహణ కొనసాగుతోందన్నారు. అదే విధంగా.. రసాయన ఆయుధాలను నిషేధించే అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా మాస్కో తన రసాయన ఆయుధాల నిల్వలను పరిసమాప్తం చేసిందని, రసాయన దాడి జరగొచ్చనే వాదనలు అసంబద్ధమైనవని షొయిగు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని