Sri Lanka: దేశంలో ఆర్థిక వ్యవస్థే లేదు.. ఇంకా సంస్కరణలతో ఏం ప్రయోజనం..!

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణలతో ప్రస్తుత దుస్థితి నుంచి బయటపడటం సాధ్యం కాదని అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే స్పష్టం చేశారు.

Published : 07 Dec 2022 01:06 IST

కొలంబో: ఆహార, ఆర్థిక సంక్షోభాలను (Economic Crisis) ఎదుర్కొంటోన్న శ్రీలంకలో ఇటీవలే రాజకీయ సుస్థిరత నెలకొంది. అయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆర్థిక సంస్కరణలు (Reforms) చేపట్టాలనే వాదన అక్కడ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక వ్యవస్థే లేనప్పుడు.. సంస్కరణలతో ప్రయోజనం లేదని అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే స్పష్టం చేశారు. నూతన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని చెప్పారు.

శ్రీలంక ఆర్థిక సదస్సు 2022లో పాల్గొని మాట్లాడిన అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే (Ranil Wickremesinghe).. కాలం చెల్లిన ప్రస్తుత ఆర్థిక విధానాలతో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల దేశ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించడాన్ని ప్రస్తావించిన ఆయన.. ఆర్థిక సంస్కరణలు చేయడం ప్రస్తుత పరిస్థితులకు విరుగుడు కాదన్నారు. సంస్కరణలు చేపట్టినా ప్రయోజనం లేదని, అత్యంత బలహీనమైన ప్రస్తుత విధానాలతో ముందుకెళ్తే అవి మళ్లీ దెబ్బతీస్తాయని అన్నారు. అందుకే కొత్త ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తామని.. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు.

దేశ స్వాతంత్ర్యానంతరం ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న శ్రీలంకను విదేశీ మారక నిల్వల కొరత వేధిస్తోంది. దీంతో దివాలా అంచుకు చేరిన ఆ దేశం.. అంతర్జాతీయ రుణాలు చెల్లించలేమని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇలా దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత నిత్యవసర వస్తువుల దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఇంధనం, ఔషధాలు, ఎరువుల కోసం శ్రీలంక పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని