WHO: మద్యంతో క్యాన్సర్‌ ముప్పు.. ఎంత మోతాదులో సేవించినా ప్రమాదమే!

మద్యం సేవించడం సురక్షితమని చెప్పడానికి ఎటువంటి రుజువులు లేవని.. ఎంత మోతాదులో తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐరోపాలో 20కోట్ల మందికి మద్యం సంబంధ క్యాన్సర్‌ ముప్పు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడించింది. 

Published : 11 Jan 2023 19:10 IST

దిల్లీ: మద్యపానం (Alcohol) సేవించడం ఆరోగ్యానికి హానికరమని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు, ఎంతోమంది వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. కానీ, తక్కువ మోతాదులో సేవించడం సురక్షితమని కొందరు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యపానానికి సురక్షితమైన పరిమితి అంటూ ఏమీ లేదని.. ఎంత మోతాదులో మద్యం సేవించినా అది ఒకరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ నివేదికను విశ్లేషిస్తూ ది లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురించింది.

మద్యంతోపాటు ఆస్బెస్టాస్‌, రేడియేషన్‌ మరియు పొగాకును అధిక ముప్పున్న గ్రూప్‌ 1 క్యాన్సర్‌ (Cancer) కారకాలుగా డబ్ల్యూహెచ్‌వోకు అనుబంధంగా ఉండే అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌సీ) వర్గీకరించింది. మద్యపానం కనీసం ఏడు రకాల క్యాన్సర్లకు కారణమని ఐఏఆర్‌సీ ఇదివరకే వెల్లడించింది. పేగు క్యాన్సర్‌, మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌లు ఇందులో ప్రధానమైనవి. వీటితోపాటు అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్లకు ఇది కారణమవుతుందని తెలిపింది.

ఐరోపాలో 20కోట్ల మందికి ముప్పు..

మద్యం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత జీవక్రియ ద్వారా విచ్ఛిన్నమవడం క్యాన్సర్‌కు కారణం అవుతుంది. ధర, నాణ్యతతో సంబంధం లేకుండా మద్యంతో కూడిన ఏ ద్రావణంతోనైనా క్యాన్సర్‌ వృద్ధి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘ఐరోపాలో స్వల్ప నుంచి ఓ మోతాదులో మద్యం సేవించే వారిలోనూ అధికంగా క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క 2017లోనే అక్కడ 23వేలు కేసులు రికార్డుకాగా అందులో సగం మద్యపానానికి సంబంధం ఉన్నవే. అందులో 50శాతం మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ బయటపడింది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ఐరోపా ప్రాంతంలో మద్యపాన వినియోగం అధికంగా ఉందని.. ఈ ప్రాంతంలో 20 కోట్ల మందికి మద్యం సంబంధిత క్యాన్సర్‌ ముప్పు ఉందని తాజా అధ్యయనంలో పేర్కొంది. ముఖ్యంగా తక్కువ నాణ్యత మద్యం సేవించే పేద, వెనకబడిన వర్గాలకు ఈ ప్రమాదం మరింత పొంచివుందని తెలిపింది.

ప్రయోజనం ఉందని చెప్పలేం..

‘‘హృదయ సంబంధ వ్యాధులకు మద్యపానం ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పడానికి ఎటువంటి అధ్యయనాలు లేవు. కానీ, తరచూ మద్యం సేవించే (Heavy Episodic Drinking) వారిలో మాత్రం హృద్రోగ వ్యాధుల ముప్పు అధికంగా ఉందనడానికి రుజువులు ఉన్నాయి. మద్యపానం సేవించడం వల్ల కొంతమేరకు రక్షణ ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్పినప్పటికీ వాటికి చాలా పరిమితులు ఉన్నాయి’’ డబ్ల్యూహెచ్‌వో ఐరోపా ప్రాంతీయ విభాగ సభ్యుడు జూర్గన్‌ రెహం పేర్కొన్నారు.

‘క్యాన్సర్‌కు మద్యం కారణమవుతుందని నిరూపితమైనప్పటికీ అనేక దేశాల్లో చాలా మందికి ఈ వాస్తవం తెలియదు. అందుకే పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే మద్యం బాటిళ్లపైనా క్యాన్సర్‌ ముప్పును తెలియజేసే సమాచారాన్ని పొందుపరచాల్సిన అవసరం ఉంది’ అని డబ్ల్యూహెచ్‌వో ఐరోపా విభాగానికి చెందిన నిపుణురాలు క్యారినా ఫెరైరా బోర్గెస్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని