Nobel Prize 2022: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన అలేన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లను ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్‌-2022 వరించింది.

Updated : 04 Oct 2022 16:02 IST

స్టాక్‌హోం: 2022 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి (Nobel Prize 2022) ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం దక్కింది. స్టాక్‌హోంలోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ అవార్డును ప్రకటించింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ  ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది. 

గతేడాది కూడా భౌతికశాస్త్రంలో (Physics) ఈ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు ఎంపిక కావడం విశేషం. సుకురో మనాబే, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలు సంయుక్తంగా ఈ బహుమతి అందుకున్నారు. అయితే జార్జియో పారిసీకి సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌ పంచుకున్నారు. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకుగానూ గతేడాది వీరికి నోబెల్‌ వరించింది.

ఇప్పటికే వైద్య, భౌతికశాస్త్రాలలో ఈ అవార్డులను ప్రకటించగా.. బుధవారం రసాయన, గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్‌ 10న ఆర్థిక రంగంలో నోబెల్‌ విజేత పేరును వెల్లడిస్తారు. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని