Nobel Prize: వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్‌ బహుమతి

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం వరించింది.

Updated : 03 Oct 2022 16:11 IST

స్టాక్‌హోం: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం -2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ పాబోకు ఈ బహుమతి దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం దీనిని ప్రకటించింది. గతేడాది మాత్రం ఉష్ణ గ్రాహకాలు, శరీర స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి అందుకున్నారు.

వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం  భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 10న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని