Ukraine Crisis: ఉక్రెయిన్‌ చిన్నారుల కోసం నోబెల్ వేలం.. రికార్డు ధరకు అమ్ముడైన పురస్కారం..!

నోబెల్ శాంతి బహుమతి వేలంలో రికార్డు స్థాయి ధర దక్కించుకుంది. 103.5 మిలియన్ డాలర్ల గరిష్ఠ మొత్తానికి అమ్ముడైంది. ఉక్రెయిన్ శరణార్థి చిన్నారుల సహాయార్థం ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని అమెరికాకు చెందిన హెరిటేజ్ ఆక్షన్స్‌ వేలానికి ఉంచగా ఈ రికార్డు నమోదైంది.

Published : 21 Jun 2022 15:10 IST

న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి వేలంలో రికార్డు స్థాయి ధర దక్కించుకుంది. 103.5 మిలియన్ డాలర్ల గరిష్ఠ మొత్తానికి అమ్ముడైంది. ఉక్రెయిన్ శరణార్థి చిన్నారుల సహాయార్థం ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని అమెరికాకు చెందిన హెరిటేజ్ ఆక్షన్స్‌ వేలానికి ఉంచగా ఈ రికార్డు నమోదైంది.

రష్యాకు చెందిన పాత్రికేయుడు దిమిత్రి మురతోవ్‌.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 2021 ఏడాదిగానూ ఆయన ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. రష్యన్ పత్రిక నొవయా గెజెటాకు ఎడిటర్ ఇన్‌ చీఫ్‌గా ఉన్నారు. ఆ దేశ రాజకీయ, సామాజిక వ్యవహరాలపై విమర్శనాత్మక, పరిశోధనాత్మక కథనాలు వెలువరించే స్వతంత్ర వార్తా సంస్థ అది. తన స్వదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణకు చేస్తున్నందుకుగానూ మురతోవ్‌కు ఈ అవార్డు దక్కింది. కాగా, ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దురాక్రమణ ఎంతోమంది చిన్నారులను శరణార్థులుగా మార్చివేసింది. వారి సహాయార్థం మురతోవ్ తన నోబెల్ బహుమతిని వేలానికి ఉంచారు. ఈ వేలంలో నోబెల్ బహుమతి 103.5 మిలియన్ల డాలర్ల ధర పలికింది. అయితే దీనిని దక్కించుకుంది ఎవరో మాత్రం వేలం సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ వెల్లడించలేదు. 2014లో నోబెల్ పురస్కారానికి వేలంలో 4.76 మిలియన్ల డాలర్లు వచ్చాయి. ఇప్పటివరకు అదే అత్యధికం. 

మూడువారాలుగా జరగుతోన్న ఈ వేలం ప్రపంచ శరణార్థుల దినోత్సవం నాడు(నిన్న) ముగిసింది. దీనిపై మురతోవ్ మాట్లాడుతూ..‘శరణార్థి చిన్నారులకు సంఘీభావంగా పెద్ద మొత్తం ధర లభిస్తుందని అనుకున్నా. కానీ, ఈ స్థాయిలో మాత్రం ఊహించలేదు’ అని ఆనందం వ్యక్తం చేశారు. వేలం సంస్థ కూడా ఇదే తరహాలో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా, ఈ మొత్తం ఐరాస అనుబంధ సంస్థ యూనిసెఫ్‌కు చేరింది. ఈ విషయాన్ని యునిసెఫ్ ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే.. 2014లో రష్యా.. క్రిమియాను ఆక్రమించడం, ప్రస్తుతం ఉక్రెయిన్‌పై జరుపుతోన్న దాడిని మురతోవ్‌ తీవ్రంగా ఖండిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని