North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్‌ ‘జాతిరత్నాలు’..!

ఐరాస ఆంక్షలను ఉల్లంఘించి అణ్వాయుధ పరీక్షలు చేస్తోన్న ఉత్తరకొరియా (North Korea).. ఆ నిధుల కోసం సైబర్‌ మోసాలకు పాల్పడుతోంది. గతేడాది ఆ దేశ హ్యాకర్లు వేల కోట్ల విలువైన క్రిప్టోలను దోచుకున్నారు.

Published : 03 Feb 2023 14:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అటు ఐక్యరాజ్య సమితి ఆంక్షలు.. ఇటు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా.. ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్‌ (Kim Jong Un) మాత్రం అణ్వాయుధ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మరి తినడానికే తిండి లేనప్పుడు అణు పరీక్షలకు డబ్బెలా.. అదంతా కిమ్‌ చెంతన ఉన్న జాతిరత్నాల్లాంటి హ్యాకర్ల పుణ్యమే మరి..! బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టో ఎక్స్‌ఛేంజిల్లోకి ఉత్తరకొరియా హ్యాకర్లు (Hackers) చొరబడి వేల కోట్లను తస్కరిస్తున్నారు. అలా గతేడాది వారి కొల్లగొట్టిన మొత్తం.. 1.7 బిలియన్‌ డాలర్లు(అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13.9వేల కోట్లు). ఈ మేరకు డిజిటల్‌ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ ‘చైన్‌ ఎనాలసిస్‌’ వెల్లడించింది.

ఉత్తరకొరియాకు చెందిన హ్యాకర్లు 2022లో 1.7 బిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టో (Crypto Currency)లను కాజేసినట్లు చైన్‌ ఎనాలసిస్‌ నివేదిక వెల్లడించింది. అంతక్రితం ఏడాది దోచేసిన 429 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇక గతేడాది మొత్తం 3.8 బిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టోలను హ్యాకర్లు దోపిడీ చేయగా.. ఇందులో 44శాతం ఉత్తరకొరియా నేరగాళ్లు చేసినవే అని సంస్థ తెలిపింది. చైనా (China), నాన్‌-ఫంగిబుల్‌ టోకెన్స్‌(ఎన్‌ఎఫ్‌టీ) బ్రోకర్ల ద్వారా ఈ హ్యాకర్లు క్రిప్టోలను దొంగిలిస్తున్నట్లు చైన్‌ ఎనాలసిస్‌ పేర్కొంది.

అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తరకొరియా.. తన అణ్వాయుధ ప్రయోగాలకు నిధుల కోసం క్రిప్టో నేరాలకు పాల్పడుతోంది. గతేడాది హారిజన్‌ బ్రిడ్జ్‌ అనే బ్లాక్‌చైన్‌ నెట్‌వర్క్‌లో 100 మిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టోలు చోరీకి గురయ్యాయి. ఇది ఉత్తరకొరియాకు చెందిన లాజరస్‌ గ్రూప్‌ పనే అని గత నెల అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ (FBI) ధ్రువీకరించింది. ఉ.కొరియాకు డాలర్లు చేరకుండా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో కిమ్‌.. క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టారు. అయితే, వాటిని తయారు చేసుకునే ఆర్థిక స్తోమత లేక ఇలా మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు వెల్లడించారు. ఆ సొమ్ముతో అణ్వాయుధాలు, క్షిపణులను తయారు చేస్తోందని ఐరాస పరిశోధక బృందాలు గతంలోనే వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని