North Korea: కవ్వింపులు ఆపని కిమ్‌.. రెండు వారాల్లో ఆరు క్షిపణి పరీక్షలు

ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఏమాత్రం ఆపడంలేదు. గురువారం ఉదయం మరో రెండు స్వల్పశ్రేణి క్షిపణులను పరీక్షించింది.  ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు విషయం వెలుగులోకి రాగానే దక్షిణ కొరియా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది.

Published : 06 Oct 2022 09:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఏమాత్రం ఆపడంలేదు. గురువారం ఉదయం మరో రెండు స్వల్పశ్రేణి క్షిపణులను పరీక్షించింది. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు విషయం వెలుగులోకి రాగానే దక్షిణ కొరియా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది. కవ్వింపు చర్యలకు బలమైన ప్రతిస్పందన ఉంటుందని ప్యాంగ్యాంగ్‌ను హెచ్చరించింది. ఇప్పటికే మంగళవారం నాడు జపాన్‌ నగరంపై నుంచి క్షిపణిని ప్రయోగించిన విషయం విదితమే. దీంతో ఐరాస భద్రతా మండలిలో అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఉ.కొరియా చర్యలకు రష్యా, చైనాల నుంచి లభిస్తున్న రక్షణే కారణమని నిందించింది. దాదాపు రెండు వారాల వ్యవధిలో ఏకంగా ఆరు సార్లు క్షిపణి పరీక్షలను నిర్వహించినట్లైంది.

జపాన్‌ పై నుంచి క్షిపణి పరీక్షకు ప్రతిస్పందనగా బుధవారం జపాన్‌-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. వీటిని అమెరికా పూర్తిగా సమర్థించింది. నిషేధిత క్షిపణి పరీక్షలతో ఈ యుద్ధ విన్యాసాలను ఏమాత్రం పోల్చలేమని పేర్కొంది.  అమెరికా భారీ ఎత్తున నౌకాదళ ఆయుధాలను కొరియా ద్వీపకల్పానికి తరలించింది. దీనిలో భాగంగా అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌, దాని స్ట్రైక్‌ గ్రూప్‌ను జపాన్‌ సముద్రానికి పంపింది. దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌ దీనిపై స్పందిస్తూ.. ఇదొక అసాధారణ చర్య అని పేర్కొన్నారు. ఉత్తర కొరియా నుంచి వచ్చే ఎటువంటి ముప్పునైనా నిర్ణయాత్మక శక్తితో ఎదుర్కొంటామన్నారు.    

అమెరికా, దక్షిణ కొరియాలతో యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ జులైలో కొరియన్‌ యుద్ధం 69వ వార్షికోత్సవం సందర్భంగా  హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థులు కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచులోకి నెడుతున్నారని కిమ్‌ అప్పట్లో ఆరోపించినట్లు గురువారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తమ సైనిక దళాలు ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని