North Korea: నెలలో నాలుగో సారి.. మరో రెండు క్షిపణులు ప్రయోగించిన ఉ.కొరియా

ప్రపంచం మొత్తం కొవిడ్‌ దెబ్బకు అతలాకుతలం అవుతుంటే.. ఉత్తరకొరియా మాత్రం వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం ఆ దేశం వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించింది.

Published : 17 Jan 2022 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచం మొత్తం కొవిడ్‌ దెబ్బకు అతలాకుతలం అవుతుంటే.. ఉత్తరకొరియా మాత్రం వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం ఆ దేశం వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ నెలలో ఈ ప్రయోగం నాలుగో సారి కావడం గమనార్హం. నేటి ప్రయోగాలను దక్షిణ కొరియా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ధ్రువీకరించారు. సున్‌నాన్‌ నుంచి ప్రయోగించిన ఈ రెండూ స్వల్ప శ్రేణి దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులుగా భావిస్తున్నారు. ఇవి 42 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి.. 380 మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో పడ్డాయి.

దీనిపై అమెరికాకు చెందిన ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ స్పందించింది. ఈ క్షిపణుల వల్ల అమెరికాకు వచ్చిన ముప్పేమీ లేదని పేర్కొంది. కానీ, ఉ.కొరియా ఆయుధ కార్యక్రమం కారణంగా ఆ ప్రదేశంలో శాంతికి విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగాలపై జపాన్‌ రక్షణ శాఖ మంత్రి నొబువు కిషి స్పందించారు. ఇవి జపాన్‌ ‘ఎక్స్‌క్ల్యూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌’ బయటే కూలిపోయాయని అన్నారు.

జనవరి నెలలోనే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం కొంత అసాధారణమే. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహించిన క్షిపణి పరీక్షల విన్యాసాలపై అసంతృప్తితో ఈ విధంగా చేస్తోంది. దీంతో తమ క్షిపణి పరీక్షల సామర్థ్యాలను, సంసిద్ధతను తెలియజేసేందుకు ఈ విధంగా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క దేశ ఆర్థిక పరిస్థితి కిమ్‌జోంగ్‌ ఉన్‌పై ఒత్తిడి పెంచకుండా.. జాతీయ భద్రతను కారణంగా చూపించుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరకొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని