Missile Fire: ఉత్తర కొరియా దూకుడు.. జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం!

వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు మీదున్న ఉత్తర కొరియా.. మంగళవారం సైతం ఓ బాలిస్టిక్‌ మిసైల్‌ను ప్రయోగించింది. అయితే, దీన్ని జపాన్‌ మీదుగా ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది.

Published : 04 Oct 2022 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నిరోజులుగా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు మీదున్న ఉత్తర కొరియా(North Korea).. మంగళవారం సైతం ఓ బాలిస్టిక్‌ మిసైల్‌(Ballistic Missile)ను ప్రయోగించింది. అయితే, దీన్ని జపాన్‌(Japan) మీదుగా ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కొరియా(South Korea), జపాన్ కోస్ట్‌ గార్డ్‌లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాల వేళ.. 10 రోజుల వ్యవధిలో ఇది అయిదో ప్రయోగం కావడం గమనార్హం. ఈ మిసైల్‌ను మధ్యంతర- శ్రేణి బాలిస్టిక్ క్షిపణి(IRBM)గా పేర్కొన్న దక్షిణ కొరియా.. ఇది దాదాపు 4,500 కిలోమీటర్లు ప్రయాణించినట్లు అంచనా వేసింది.

జపాన్‌ భూభాగం మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం ఐదేళ్లలో మొదటిసారి. దీంతో అప్రమత్తమైన జపాన్‌.. తమ క్షిపణి హెచ్చరిక వ్యవస్థను ‘యాక్టివేట్‌’ చేసింది. ఈశాన్య ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ఆవాసాల్లో ఆశ్రయం పొందాలనే అరుదైన హెచ్చరికను జారీ చేసింది. హొక్కైడో, అవోమొరి రీజియన్‌లలో రైళ్లను కొద్దిసేపు నిలిపేసింది. జపాన్ కోస్ట్ గార్డ్ సైతం.. నేవీ నౌకలను అప్రమత్తం చేసింది. తాజా క్షిపణి పసిఫిక్‌ సముద్రంలో పడినట్లు అంచనా. కిమ్‌ ప్రభుత్వం 2017లో చివరిసారి జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది.

మండిపడ్డ అమెరికా, మిత్రదేశాలు..

ఈ ప్రయోగాన్ని అమెరికా.. ప్రమాదకరమైనదిగా పేర్కొంది. ఇది జపాన్‌వాసులకు ముప్పు తలపెట్టే పనేనని మండిపడింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా దీన్ని హింసాత్మక చర్యగా అభివర్ణించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్- యోల్ ఈ ప్రయోగాన్ని.. ఐరాస నిబంధనల ఉల్లంఘన, రెచ్చగొట్టే చర్యగా పేర్కొన్నారు. దీనికి దీటైన సమాధానం చెబుతామని పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా క్షిపణి ‘హ్వాసాంగ్-12’ అయి ఉండొచ్చని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా అభిప్రాయపడ్డారు. 2017 ఆగస్టు, సెప్టెంబరులో జపాన్ మీదుగా రెండుసార్లు ఈ మిసైళ్లను ప్రయోగించినట్లు సమాచారం.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts