North Korea: ఉత్తర కొరియా దూకుడు.. మూడు రోజుల్లో రెండో క్షిపణి ప్రయోగం

క్షిపణి ప్రయోగాల్లో ఉత్తర కొరియా తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా శనివారం జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఓ బాలిస్టిక్ క్షిపణి(ఎస్‌ఎల్‌బీఎం)ని పరీక్షించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. కిమ్‌ ప్రభుత్వం అణు పరీక్షలకు సన్నద్ధమవుతోందన్న...

Published : 08 May 2022 02:31 IST

సియోల్‌: క్షిపణి ప్రయోగాల్లో ఉత్తర కొరియా తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా శనివారం జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఓ బాలిస్టిక్ క్షిపణి(ఎస్‌ఎల్‌బీఎం)ని ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. కిమ్‌ ప్రభుత్వం అణు పరీక్షలకు సన్నద్ధమవుతోందన్న అమెరికా హెచ్చరికల నడుమ.. మూడు రోజుల వ్యవధిలోనే రెండో క్షిపణి ప్రయోగం చేపట్టడం గమనార్హం. 2022 మొదటినుంచే ఈ దేశం క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. 2017 తర్వాత మొదటిసారి పరీక్షించిన ఫుల్‌ రేంజ్‌ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సహా 15 పరీక్షలు నిర్వహించింది.

దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యున్ సుక్-యోల్‌గా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు ఈ ప్రయోగం జరపడం చర్చనీయాంశంగా మారింది. ‘‘ఎస్‌ఎల్‌బీఎం’గా భావిస్తున్న ఓ స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా తన ప్రధాన నౌకాదళ స్థావరం సిన్‌పో సమీపంలోని సాగర జలాల నుంచి ప్రయోగించినట్లు తమ సైన్యం గుర్తించింది’ అని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సిన్‌పోలో జలాంతర్గాములు ఉన్నట్లు గతంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలు బయటకు వచ్చాయి. జపాన్ కోస్ట్ గార్డ్ సైతం.. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. తమ నౌకలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరోవైపు.. ఉత్తర కొరియా అతి త్వరలోనే అణు పరీక్షలను పునఃప్రారంభించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరించింది. ‘ప్యాంగ్యాంగ్‌ తన అణు పరీక్ష కోసం ‘పుంగ్గే-రి’ టెస్ట్ సైట్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే అక్కడ పరీక్షించడానికి సిద్ధంగా ఉంది’ అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి జలీనా పోర్టర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెలాఖరులో జపాన్, దక్షిణ కొరియాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో.. యున్ సుక్-యోల్‌ ప్రమాణ స్వీకారం సమయంలో లేదా బైడెన్ పర్యటన సందర్భంగా ఈ పరీక్ష జరగొచ్చని అంచనా వేస్తున్నారు. 2017 వరకు ఉత్తర కొరియా ఆరుసార్లు అణు పరీక్షలు నిర్వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని