North Korea: ఉత్తర కొరియా అదే ధోరణి! ఏకంగా మూడు క్షిపణుల ప్రయోగం

కొవిడ్‌ కలవరం గుప్పిటలో ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియా తన క్షిపణి ప్రయోగాల్లో దూకుడును మరోసారి ప్రదర్శించింది. గురువారం ఏకంగా మూడు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. 2022 మొదటినుంచే...

Published : 12 May 2022 18:50 IST

సియోల్‌: కొవిడ్‌ కలవరం గుప్పిటలో ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియా తన క్షిపణి ప్రయోగాల్లో దూకుడును మరోసారి ప్రదర్శించింది. గురువారం ఏకంగా మూడు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. 2022 మొదటినుంచే కిమ్‌ ప్రభుత్వం తన క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. 2017 తర్వాత మొదటిసారి పరీక్షించిన ఫుల్‌ రేంజ్‌ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సహా ఇప్పటివరకు 16 పరీక్షలు నిర్వహించడం గమనార్హం.

ప్యోంగ్యాంగ్‌లోని సునాన్ ప్రాంతం నుంచి మూడు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు తమ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. వాటిని జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు చెప్పారు. జపాన్ రక్షణ శాఖ కూడా ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించింది. జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ ఈ మేరకు తమ నౌకలకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యున్‌ సుక్‌- యోల్‌ ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల వ్యవధిలో ఈ ప్రయోగం జరగడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు.. ఉత్తర కొరియా అతి త్వరలోనే అణు పరీక్షలను పునఃప్రారంభించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల హెచ్చరించింది. ‘ప్యోంగ్యాంగ్‌ తన అణు పరీక్ష కోసం ‘పుంగ్గే-రి’ టెస్ట్ సైట్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే అక్కడ పరీక్షించడానికి సిద్ధంగా ఉంది’ అని అగ్రరాజ్యం విదేశాంగశాఖ ప్రతినిధి జలీనా పోర్టర్ తెలిపారు. 2017 వరకు ఉత్తర కొరియా ఆరుసార్లు అణు పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉండగా.. తాజాగా కిమ్‌ దేశంలో తొలి కొవిడ్ కేసును ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం ‘తీవ్రస్థాయి జాతీయ అత్యయిక పరిస్థితి’ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని