North Korea: కిమ్‌ రాజ్యంలోకి కరోనా తొలి అడుగు..!

కరోనా మహమ్మారి ముందు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ ఓడిపోయారు. రెండేళ్లపాటు దేశంలోకి వైరస్ రాకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Published : 12 May 2022 11:27 IST

తీవ్రస్థాయి జాతీయ అత్యయిక పరిస్థితి విధించిన కిమ్ ప్రభుత్వం

ప్యాంగ్యాంగ్‌: కరోనా మహమ్మారి ముందు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ ఓడిపోయారు. రెండేళ్లపాటు దేశంలోకి వైరస్ రాకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తమ దేశంలో కరోనా అడుగుపెట్టిందని చివరకు కిమ్ అంగీకరించాల్సి వచ్చింది..! తాజాగా ఉత్తరకొరియా తొలి కొవిడ్-19 కేసును ధ్రువీకరించింది. దాంతో అక్కడి ప్రభుత్వం ‘తీవ్రస్థాయి జాతీయ అత్యయిక పరిస్థితి’ని విధించింది. దేశంలో బయటపడిన ఈ వైరస్‌ను పారదోలేందుకు కిమ్ ప్రతిజ్ఞ చేసినట్లు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది.

రాజధాని నగరం ప్యాంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతోన్న రోగుల నుంచి తీసిన నమూనాలను పరీక్షించగా.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. అయితే, ఇప్పుడు అక్కడ ఏ స్థాయిలో కరోనా కేసులు ఉన్నాయో స్పష్టమైన సమాచారం లేదు. రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటి వరకు టీకాలు అందలేదని తెలుస్తోంది. కటిక పేదరికాన్ని అనుభవిస్తోన్న ఆ దేశ వైద్య వ్యవస్థ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సమయంలో అక్కడ వైరస్ విజృంభిస్తే.. క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితిపై కిమ్‌ ఉన్నతాధికారులతో క్రైసిస్‌ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు చేపడతామని ప్రకటించారు. ‘అత్యల్ప సమయంలో మూలాన్ని గుర్తించి, నివారించడమే లక్ష్యమని కిమ్ వెల్లడించారు. ప్రజలకున్న రాజకీయ అవగాహన వల్ల అత్యవసర పరిస్థితిని అధిగమిస్తామని, ఎమర్జెన్సీ క్వారంటైన్‌ ప్రాజెక్టులో విజయం సాధిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కఠిన సరిహద్దు నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు’ అంటూ ఆ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా చుట్టుపక్క దేశాలు కరోనా విజృంభణతో ఇబ్బందిపడుతున్నాయి. అధిక వ్యాక్సినేషన్ రేటు ఉన్న దక్షిణ కొరియా ఈ మార్చిలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఉక్కిరిబిక్కిరైంది. కేసులు దిగిరావడంతో ఇటీవలే దాదాపు అన్ని నిబంధనలను సడలించింది. కరోనా పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాలో.. ఒమిక్రాన్ వేరియంట్ దశల వారీగా విజృంభిస్తోంది. ఇటీవల ఆర్థిక రాజధాని షాంఘై సహా పలు నగరాలు కరోనా విజృంభణ, ఆంక్షలతో ఎంతగా ఇబ్బంది పడుతున్నాయో చూస్తున్నాం. ఈ దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్లు అందాయి. అదే ఉత్తర కొరియా విషయానికొస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకాలు ఇస్తామని చెప్పినా వద్దనుకుంది. చైనా, రష్యాకు కూడా నో చెప్పింది. ఇకపోతే.. ప్యాంగ్యాంగ్, దానికి సమీప ప్రాంతాలు రెండురోజుల పాటు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయని ఓ వార్త సంస్థ పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని