North Korea: మరోసారి ఉత్తర కొరియా దూకుడు.. ఏకంగా ఎనిమిది క్షిపణుల ప్రయోగం!

క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. ఆదివారం ఏకంగా ఎనిమిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. నాలుగేళ్ల తర్వాత అమెరికా, దక్షిణ కొరియాలు...

Published : 06 Jun 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. ఆదివారం ఏకంగా ఎనిమిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. నాలుగేళ్ల తర్వాత అమెరికా, దక్షిణ కొరియాలు నిర్వహించిన మొదటి సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన మరుసటిరోజే ఈ ప్రయోగాలు చేపట్టడం గమనార్హం. ఇదిలా ఉండగా.. 2022 మొదటినుంచే కిమ్‌ ప్రభుత్వం క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. 2017 తర్వాత మొదటిసారి పరీక్షించిన ఫుల్‌ రేంజ్‌ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సహా ఇప్పటివరకు 17 పరీక్షలు నిర్వహించింది.

ప్యాంగ్యాంగ్‌లోని సునాన్ ప్రాంతం నుంచి ఎనిమిది స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు తమ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్‌ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. వాటిని జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తమ సైన్యాన్ని అప్రమత్తం చేశామన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తున్నాయని పేర్కొన్నారు. జపాన్‌ సైతం తాజా ప్రయోగాలను ధ్రువీకరించింది. అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో పరీక్షలు జరపడం అసాధారణ విషయమని జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా ఆరు క్షిపణులను ప్రయోగించిందని చెబుతూ.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇదిలా ఉండగా.. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. వాటిని తమపై దాడుల కోసం చేపడుతోన్న రిహార్సల్స్‌గా అభివర్ణించింది. ఆదివారం నాటి ప్రయోగాలు కూడా.. ఈ విన్యాసాలకు ప్రతిస్పందనగానే నిర్వహించి ఉండొచ్చని అసన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ పరిశోధకుడు గో మ్యోంగ్ హ్యూన్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి విన్యాసాలు భారీ స్థాయిలో జరిగాయని భావిస్తూ.. అందుకు దీటుగానే ఏకంగా ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోందని ఓ వార్తాసంస్థకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని