Published : 15 May 2022 10:48 IST

North Korea COVID-19 Outbreak: కిమ్‌ రాజ్యంలో కరోనా స్వైరవిహారం

ప్యాంగ్యాంగ్‌: ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి (North Korea COVID-19 Outbreak) స్వైరవిహారం చేస్తోంది. దాదాపు రెండేళ్ల పాటు వైరస్ ఆనవాళ్లు లేవని చెప్పుకున్న రాజ్యం ఇప్పుడు మహమ్మారి (Pandemic) వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరవుతోంది. శనివారం మహమ్మారికి మరో 15 మంది బలైనట్లు ఆ దేశ అధికారిక మీడియా ‘కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (KCNA)’ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పాయారు.

కొత్తగా 2,96,180 మందిలో వైరస్‌ లక్షణాలతో కూడిన జ్వరాలను గుర్తించినట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు 8,20,620 మంది వైరస్‌ బారిన పడ్డారు. తొలి కరోనా కేసును గుర్తించినట్లు గురువారమే ఉత్తరకొరియా (North Korea) ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన కేవలం మూడు రోజుల్లోనే కేసులు ఈ స్థాయికి పెరగడం కలవరపరుస్తోంది. ఇది తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఉత్తరకొరియా (North Korea)లో క్షేత్రస్థాయి ఆరోగ్య వ్యవస్థలు దశాబ్దాలుగా చాలా బలహీనంగా ఉన్నాయి. పైగా మహమ్మారి ప్రవేశాన్ని నిలువరించడంలో భాగంగా ఆ దేశం విదేశాలతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకొంది. దీంతో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించడానికి కావాల్సిన కనీస కిట్లు కూడా లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి (Pandemic) భారీ ఎత్తున వ్యాప్తి చెందితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మరోవైపు ఉత్తరకొరియా (North Korea) ప్రభుత్వం మాత్రం మహమ్మారి వ్యాప్తి కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. ఈ మేరకు ప్రభుత్వాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దాదాపు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తల్ని రంగంలోకి దింపినట్లు పేర్కొంది. వీరంతా ప్రజల్లో లక్షణాలను గుర్తించి పరీక్షలు చేయడం, జనాల్లో వైరస్‌ వ్యాప్తిపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని తెలిపింది. అలాగే భారీ ఎత్తున ఐసోలేషన్‌ కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది.

 

దేశవ్యాప్తంగా అక్కడి ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్లు (Lock Down) అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో ఆంక్షలు పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదంతా తీవ్ర ఆహార, ఆరోగ్య సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తర కొరియా (South Korea)కు వ్యాక్సిన్లు సహా మహమ్మారి అదుపునకు కావాల్సిన ఇతర సాయాన్ని అందించడానికి చైనా, దక్షిణ కొరియా ముందుకు వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు కిమ్‌ సర్కార్‌ మాత్రం వాటిని అంగీకరించడానికి అధికారికంగా ముందుకురాలేదు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని