North Korea: కిమ్‌ రాజ్యంలో ఒక్కరోజే 2.7లక్షల కరోనా కేసులు..!

ఉత్తర కొరియాలో కొవిడ్‌ విజృంభణ తీవ్ర స్థాయికి చేరినట్లే కన్పిస్తోంది. అక్కడ రోజువారీ కేసులు ఏకంగా లక్షల్లో ఉండటం వైరస్‌ ఉద్ధృతిని అద్దం పడుతోంది. భారీగా టెస్టులు చేసే అవకాశం ఉత్తరకొరియాకు లేకపోవడంతో..

Published : 17 May 2022 11:37 IST

సియోల్‌: ఉత్తర కొరియాలో కొవిడ్‌ విజృంభణ తీవ్ర స్థాయికి చేరినట్లే కన్పిస్తోంది. అక్కడ రోజువారీ కేసులు ఏకంగా లక్షల్లో ఉండటం వైరస్‌ ఉద్ధృతికి అద్దం పడుతోంది. భారీగా టెస్టులు చేసే అవకాశం ఉత్తరకొరియాకు లేకపోవడంతో.. లక్షణాల ఆధారంగానే కరోనాగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే 2,69,510 మంది తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు మీడియా వెల్లడించింది. ఇక జ్వరం కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరకొరియాలో ఏప్రిల్‌ చివరి నుంచి ఈ తీవ్ర జ్వరం వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు 14.8లక్షల మంది జ్వరం బారిన పడగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఉత్తర కొరియా యాంటీ వైరస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వెల్లడించింది. అయితే మరణాల సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాధితుల్లో ఎంతమందికి కొవిడ్‌ పాజిటివ్‌ అనేది ప్రభుత్వం వెల్లడించనప్పటికీ.. దాదాపు అందరికీ కొవిడ్‌ సోకి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో ఇప్పటివరకు సగం మంది కోలుకోగా.. ఇంకా 6.63లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు మీడియా తెలిపింది.

భారీ ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉత్తర కొరియాకు లేకపోవడంతో ఎంతమందికి కరోనా సోకిందనే విషయంపై స్పష్టత రావట్లేదు. దీంతో కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని షెల్టర్లలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు, దేశంలో ఎవరూ వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. ఆరోగ్య వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో కరోనా పెను ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉత్తర కొరియాలో వైరస్‌ మరణాలు రికార్డు స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన వ్యూహాలను అమలు చేయాలని దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అధికారులకు సూచించారు. ఔషధాల పంపిణీకి సైన్యాన్ని రంగంలోకి దించారు. జ్వరంతో ఉన్నవారికి గుర్తించి క్వారంటైన్‌కు పంపేందుకు ఆరోగ్య అధికారులు, టీచర్లు, వైద్య విద్యార్థులను ఇంటింటికీ పంపుతున్నారు. అయితే వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్లను తీసుకోవడంపై కిమ్‌ నుంచి ఎలాంటి ప్రకటన గానీ, అభ్యర్థనలు గానీ రాకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని